కల్తీ సారా, నాసిరకం మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళనలు రెండో రోజు కొనసాగాయి. ముఖ్యమంత్రి జగన్‌పై నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధాలే శ్వాసగా బతికేస్తున్నారు అని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం మరణాల మీద సీఎం జగన్ వ్యాఖ్యను పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. తన బినామీలతో మద్యం కంపెనీలు పెట్టించి జగన్‌రెడ్డి రూ.30 వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చాక దశల వారీగా ఆదాయాన్ని పెంచుకుంటున్నారని దుయ్యబట్టారు.
- శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పాతపట్నంలో తెదేపా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పలాసలో ర్యాలీ చేశారు.
- విజయనగరం జిల్లా సాలూరులో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బొబ్బిలిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, శృంగవరపు కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
- విశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కల్తీ మద్యం నిషేధించాలంటూ మాడుగుల నియోజకవర్గం దేవరపల్లిలో, యలమంచిలిలో నినదించారు.
- తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు మెడలో మద్యం సీసాలను కట్టుకుని నిరసన తెలిపారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు.
- పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, మొగల్తూరులో వైకాపా ప్రభుత్వం మద్యం దోపిడీని మానుకోవాలని ఆందోళనలు చేపట్టారు.
- కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు.
- గుంటూరు జిల్లా మంగళగిరిలో నిరసన ప్రదర్శన చేశారు. పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. తాడికొండలో తెనాలి శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేశారు.
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, కంభం, చీమకుర్తి, సంతనూతలపాడు, బొల్లాపల్లి అడ్డరోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు.
- నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు సాగాయి. నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, ఆత్మకూరుల్లో తెదేపా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.
- కర్నూలు జిల్లాలోని బనగానపల్లె, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కోసిగిల్లో ఆందోళనలు కొనసాగాయి.
- కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్‌ఈబీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. బద్వేలులో నిరసన తెలిపారు.
- చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పూతలపట్టు నియోజకవర్గాల్లో మద్యం దుకాణాల వద్ద ధర్నా చేశారు.
- అనంతపురం జిల్లా ధర్మవరం, సింగనమల, గుంతకల్లు.. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే కె.ఈరన్న ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.