TDP protests: పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని దేవినేని ఉమ నిరసన తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి నుంచి మైలవరం వరకు బస్సులో ప్రయాణించారు. ఛార్జీల భారంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్రజలపై జగన్ భారాల బాదుడే...బాదుడు కొనసాగుతోందని దేవినేని ఉమ మండిపడ్డారు. మోసపూరిత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రజలపై భారాలు మోపుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ కానుకలుగా ప్రజలకు జగన్ బాదుడు బాదేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ఆర్టీసీ ఛార్జీలు పెంచారని దేవినేని ఉమ విమర్శించారు. ఉగాది సందర్భంగా విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. బాదుడు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.
TDP protests: ఆర్టీసీ బస్సు ఛార్జీలపెంపుపై నిరసనగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజవర్గం తెదేపా ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నియోజకవర్గ నాయకుల కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పోరంకి సెంటర్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో ఉయ్యూరు బస్ స్టాండ్ వరకు ప్రయాణించి వారికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాల గురించి అవగాహన కల్పించారు. దీనిలో భాగంగానే దారిలోని బస్టాప్ వద్ద పెరిగిన బస్ చార్జీలు, విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. పలువురు ప్రయాణికులతో మాట్లాడుతూ తెదేపా హాయంలో ఉన్న ఛార్జీలు ప్రస్తుత చార్జీలను బేరీజు వేస్తూ ప్రజలు ఎంత నష్టపోతున్నారో వివరించారు. బోడెప్రసాద్‌తోపాటు మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాదుడే బాదుడు ప్రభుత్వం బస్సు ఛార్జీల వాత పెట్టిందంటూ... కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఛార్జీల మోత ఎలా ఉందో డిపోలో ప్రయాణికులకు అవగాహన కల్పించారు.
TDP protests: ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నెల్లూరులో నిరసనలు కొనసాగుతున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరంలో తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. తెదేపా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ప్రధాన బస్టాండ్ ఎదుట రిక్షాలు తొక్కుతూ తమ నిరసన తెలియజేశారు. చార్జీల పెంపుతో సామాన్యులకు ఆర్టీసీ దూరమౌతుండటంతో, ఇక ప్రజలకు రిక్షాలే దిక్కని విమర్శించారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులపై విపరీతంగా చార్జీలు పెంచడం దుర్మార్గమని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మరోపక్క సీపీఎం పార్టీ నేతలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించింది. ప్రజలపై మోపుతున్న భారాలు తగ్గించాలంటూ మోపుతున్న భారాలు తగ్గించాలంటూ నినదించారు. ఇష్టానుసారంగా చార్జీలు పెంచి ప్రయాణికులపై భారాలు వేయడం తగదని ప్రభుత్వ తీరును సిపిఎం నేతలు ఖండించారు.
TDP protests: ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుపై శ్రీకాకుళం జిల్లా పలాస లో తెలుగుదేశం నేతలు చేసిన ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డుపై ధర్నా చేస్తుండగా... సీఐ శంకర్రావు వారిని తోసేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో పోలీసులను తెదేపా కార్యకర్తలు నెట్టేశారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసిన తెదేపా నేతలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.