అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవిలా రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సచివాలయం ఫైర్‌స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ చేపట్టిన నిరసనలో తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పంటకు గిట్టుబాటు ధరతో పాటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరికంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. రైతుల పంట కొనే నాథులే లేరని చంద్రబాబు మండిపడ్డారు. వేరుశెనగ, పామాయిల్, శెనగ, పసుపు, పత్తి రైతులు కష్టాల్లో ఉన్నందున... వారికీ గిట్టుబాటు ధర చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల క్రితం విత్తనాల కోసం క్యూలైన్లో ముగ్గురు రైతులు మృతి చెందగా... నిన్న ఉల్లి కోసం క్యూలైన్లో మరొకరి మృతి చెందటం విచారకరమన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని వారి సమస్యలపై సభలో ప్రస్తావించాలన్నారు. సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌కు శ్రద్ధ లేదన్నచంద్రబాబు... తెదేపాని అణిచి వేయడంపైనే వైకాపా దృష్టి పెట్టిందని మండిపడ్డారు. మొక్కజొన్న ధర క్వింటాల్‌కు 600 రూపాయలకు పడిపోయిందన్న చంద్రబాబు... వేరుశనగ ధర సగానికి పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారన్న ఆయన... పత్తి బోరాలు, పెట్రోల్ సీసాలతో రైతులు ఆందోళనలు చేస్తున్నారని ఆక్షేపించారు. రుణమాఫీ 4,5 కిస్తీలు రైతులకు వెంటనే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉందని తెలుగుదేశం నేతలు ఆక్షేపించారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేవరకు పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
'రైతు సమస్యల పరిష్కారంపై సీఎంకు శ్రద్ధ లేదు'
రాష్ట్రంలో రైతు సమస్యలపై తెలుగుదేశం ఆందోళన బాట పట్టింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ అధినేత చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. వరికంకులు, పత్తి మొక్కలు, పామాయిల్ గెలలతో ర్యాలీ చేపట్టారు. రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు.
తెదేపా నిరసన