ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP protest: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెదేపా నిరసనలు - ఏపీ తాజా వార్తలు

పెరిగిన పెట్రో, నిత్యావసరధరలను వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. బైక్‌ ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీ శ్రేణులతో నాయకులు భారీ ర్యాలీలు చేపట్టారు. పలుచోట్ల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

tdp protest
tdp protest

By

Published : Aug 28, 2021, 10:10 AM IST

Updated : Aug 28, 2021, 1:41 PM IST

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు తెదేపా నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ నేతలను గృహనిర్బంధం చేశారు. అనేకచోట్ల చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్ చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెదేపా నిరసనలు
  • శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో తెలుగుదేశం బైక్ ర్యాలీకి పిలుపునివ్వగా.. పోలీసులు నిరాకరించారు. పోలీసుల తీరుకు నిరసనగా.. కొత్తపేట జాతీయ రహదారి నుంచి కోటబొమ్మాళి రైతు బజార్ వరకు తెదేపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఇందులో పాల్గొన్నారు. టెక్కలిలోనూ తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించారు.

శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నేతలు ర్యాలీ
  • కడప జిల్లాలో..

జిల్లాలోని తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీకి బీటెక్‌ రవి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీటెక్ రవి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. జిల్లాలో పోలీసులు ఎక్కడికక్కడ నేతలను గృహనిర్బంధం చేశారు. పులివెందుల వరకు 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

కడపలో తెదేపా నేతలు నిరసన
  • అనంతపురం జిల్లాలో...

పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెంపునకు నిరసనగా తెదేపా నాయకులు, కార్యకర్తలు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడానికి భారీగా పోలీసులు మోహరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహల్‌ గ్రామం నుంచి బొమ్మనహల్ వరకు తెదేపా నాయకులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో తెదేపా నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉప్పరహాల్‌ రైల్వే గేటు వద్ద కాలవ శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ స్టేషన్‌కు తరలించారు.

అనంతపురంలో తెదేపా నిరసన ర్యాలీ
  • చిత్తూరు జిల్లాలో..

చిత్తూరు జిల్లా చంద్రగిరి క్లాక్‌ టవర్‌ వద్ద తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.

కృష్ణా జిల్లాలో తెదేపా నేతలు ధర్నా
  • కృష్ణా జిల్లాలో..

విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద తెలుగుదేశం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. పార్టీ నాయకులు బొండా ఉమ, గద్దె రామ్మోహన్‌ పాల్గొని.. వైకాపా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయని విమర్శించారు. హనుమాన్ జంక్షన్‌లో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా చేపట్టిన నిర‌స‌న కార్యక్రమంలో బాపుల‌పాడు, ఉంగుటూరు, గ‌న్నవ‌రం, విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లాల‌కు చెందిన నాయ‌కులు, కార్యక‌ర్తలు భారీగా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎడ్లబండిపై నిరసన తెలిపారు. ఈ నిరసనలో తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్య ప్రజల బ్రతుకులను ప్రభుత్వం దుర్భరం చేస్తోందని దేవినేని ఉమ ఆరోపించారు.

అవనిగడ్డలో రోడ్డు పై వంటావార్పు
  • ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా చీరాల అంబేడ్కర్‌ కూడలిలో తెదేపా నిరసన తెలిపింది. నిత్యావసరాలు, పెట్రో, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై నేతలు ఆందోళన చేశారు. ఇంకొల్లులో తెదేపా నేతలు ధర్నా చేపట్టారు. యర్రగొండపాలెంలో నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

  • గుంటూరు జిల్లా...

గుంటూరులో ఎడ్లబండి, సైకిళ్లపై తెదేపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్, కోవెలమూడి రవీంద్ర ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

తెనాలిలో తెదేపా నేత ఆలపాటి రాజా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మార్కెట్‌ సెంటర్‌లో నిరసన దీక్ష చేపట్టారు. బాపట్లలో భావన్నారాయణ స్వామి గుడి వద్ద తెదేపా ఆందోళన చేసింది. పెట్రో ధరలు తగ్గించాలని ఆలయం వద్ద నేతలు కొబ్బరికాయలు కొట్టారు. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు వారిని అరెస్టు చేశారు.

పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శ చేపట్టారు. ఆటోను తాడుతో లాగి నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

గుంటూరు జిల్లాలో తెదేపా నిరసన

వేమూరులో నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలంటూ సైకిళ్లతో ఆందోళన చేశారు. వేమూరులో ఎడ్లబండిపై బైక్‌ను తీసుకెళ్లి పంటకాల్వలో పడేసి నిరసన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను జగన్ మోసం చేశారని నక్కా ఆనందబాబు విమర్శించారు. జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

  • తూర్పుగోదావరి జిల్లా..

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో తేదేపా నేతలు వినూత్న నిరసన చేపట్టారు. పెట్రోల్ గ్యాస్ నిత్యావసర ధరలు అమాంతం పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్లు పెట్టి కావిడి మోస్తూ, రిక్షాపై మోటార్ సైకిల్ పెట్టి తొక్కుకూ, రోడ్జుపై కట్టెల పొయ్యితో వంట చేసి నిరసన తెలిపారు. రావులపాలెం నుంచి ర్యాలీగా స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో కావిడిలో గ్యాస్ బండ మోస్తూ నిరసన
  • కర్నూలు జిల్లా..

కర్నూలు జిల్లా నంద్యాలలో తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాసనగర్ కూడలి వద్ద తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, తెదేపా నాయకుడు ఎన్ ఎండి ఫిరోజ్, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. పలు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించి ప్రజలకు మేలు చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి పట్టించుకోకుండా ఉండడం శోచనీయమన్నారు.

కర్నూలులో తెదేపా నిరసన
  • విశాఖ జిల్లా..

పెరిగిన ధరలను నిరసిస్తూ విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాలుగు రహదారుల కూడలియిన కొత్తూరులో మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదేశ్వరరావు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఎడ్లబండిపై తెదేపా నేతలు నిరసన
  • విజయనగరం జిల్లా..

పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల బతుకులను రోడ్డునపడేశారని తెదేపా నేతలు మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం గంటస్తంభం వద్ద తెదేపా నేతలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఐవిపి. రాజు, పార్లమెంట్ అధికార ప్రతినిధి కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

  • నెల్లూరు జిల్లా..

నెల్లూరు జిల్లా నాయుడుపేట గాంధీ పార్కు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ తెదేపా నాయకులు ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై వాహనాల ప్రదర్శన చేశారు. మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్​ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చారు.

నిరసన తెలుపుతున్న తెదేపా నేతలు
  • పశ్చిమగోదావరి జిల్లా..

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో తెదేపా నేతలు నిరసన తెలిపారు. ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరిగిన వంట గాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుని నడ్డి విరిచేలా ఉన్నాయంటూ జాతీయ రహదారిపై ఉంగుటూరు కూడలిలో నిరసన తెలియజేశారు.

ఇదీ చదవండి: AP RAINS: రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్ష సూచన

Last Updated : Aug 28, 2021, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details