కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఆదుకోవాలని.. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు చేపట్టారు.
గుంటూరు జిల్లాలో..
ముస్లిం మైనార్టీలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ... గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నంద్యాల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని తెదేపా నేతలు ఆలపాటి రాజా, నసీర్ అహమ్మద్ డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేసి కంటితుడుపు చర్యలు చేపట్టారని... తక్షణమే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నంద్యాల ఘటనపై విచారణలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ... గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. గుంటూరు నల్లచెరువు మదర్శ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.... ఇప్పుడు మైనారిటీలపైన దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తుందని విమర్శించారు. శాసన మండలిలో షరీఫ్‌ను కించరపరచడం, సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి వైకపా నేతనే కారణమని ఆరోపించారు.
నంద్యాల ఘటనను నిరసిస్తూ.. చిలకలూరిపేటలో తెదేపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఎన్ఆర్టీ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో తెదేపా, ముస్లిం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో..
నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్య ఘటనపై టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని జామీయ మసీదు నుంచి సోమప్ప కూడలి వరకు శ్యాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలన్నారు. ఈ ర్యాలీలో ముస్లింలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అబ్దుల్ సలాం కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కళ్యాణ్ దుర్గంలోని ముస్లిం నాయకులు, తెదేపా నేతలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ భవన్లో అబ్దుల్ మౌలానా కలాం ఆజాద్ జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం తెదేపా పిలుపు మేరకు అక్కనుంచి మసీద్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం ప్రభుత్వం, పోలీసులే అంటూ పలువురు ముస్లిం నాయకులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సలామ్ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. బనగానపల్లి ఖాజీ వాడ మసీదు సమీపంలో ముస్లిం నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి తక్షణమే రూ. రెండు కోట్ల ఆర్థిక సాయం అందజేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అత్తర్ జావేద్, బురానుద్దీన్, కలాం, సలాం, తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో..
నంద్యాల ఘటనకు కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. విశాఖ జీవీయంసీ గాంధీ విగ్రహం తెదేపా ఆద్వర్యంలో ముస్లిం నాయకులు నిరనస చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విశాఖ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మైనార్టీలకు అండగా తెదేపా ఉంటుందని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. పాడేరు అంబేడ్కర్ కూడలి వద్ద ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సలీం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముస్లిం సోదరులు నినాదాలు చేశారు. రేపు కాగడాల ప్రదర్శన, 13న మసీదులలో బాధితులకు అండగా ప్రార్థన చేస్తామని తెలిపారు.
విశాఖ తెదేపా కార్యాలయంలో సలాం కుటుంబానికి కొవ్వొతులతో నివాళి అర్పించారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లంమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.