Tdp Protest Against illegal Ration Rice supply: రాష్ట్రంలో రేషన్‌బియ్యం లబ్ధిదారులకు చేరకుండా పక్కదారి పడుతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా నివారించాలంటూ విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్లోని రేషన్ దుకాణం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకూ తెదేపా శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్‌కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వినతిపత్రం అందించారు. పేదల రేషన్ బియ్యాన్ని నాటు సారా తయారీ కోసం వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం శ్రేణులు ఆందోళన నిర్వహించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని వైకాపా నేతలు అమ్ముకుంటున్నారని బాపట్ల జిల్లా చీరాల తెదేపా నాయకులు ఆరోపించారు. చీరాల శివాలయం సమీపంలోని రేషన్ షాప్ వద్ద ఆందోళన చేపట్టారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఏలూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో పేదల ఆహార భద్రతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని.. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో తెదేపా నేతలు మండిపడ్డారు. వైకాపా పాలనలో ఆహార భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో బియ్యం మాఫియా చెలరేగిపోతోందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని వైకాపా నాయకులు అక్రమంగా అమ్ముకోవడాన్ని నిరసిస్తూ విజయనగరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు.