ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రత్యర్థులకు కంట పడకుండా.. రహస్య ప్రదేశాలకు తెదేపా అభ్యర్థులు! - ap municipal elections updates

సాధారణంగా ఎన్నికల్లో పోలింగ్‌ ముగిశాక రెండు పార్టీలు దాదాపు సమానంగా సీట్లు గెలుచుకుంటే.. పార్టీ ఫిరాయిస్తారన్న భయంతో సీఎం ఎన్నికో, ఛైర్మన్‌ ఎన్నికో పూర్తయ్యే వరకూ శిబిర రాజకీయాలు నిర్వహించడం చూశాం. ఇప్పుడు పురపాలక ఎన్నికల్లో విపక్షాలు నామినేషన్ల ఉపసంహరణ దశలోనే తమ అభ్యర్థులతో శిబిరాలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు తీవ్రమవడంతో.. వారిని కాపాడుకోవడానికి ప్రధాన ప్రతిపక్షం తెదేపా అనేక తంటాలు పడుతోంది. తమ అభ్యర్థుల్ని రహస్య ప్రదేశాలకు పంపించింది. కొన్నిచోట్ల అభ్యర్థులతో తెదేపా నాయకులు టచ్‌లో ఉంటూ.. వేయికళ్లతో కాపు కాస్తున్నారు.

tdp protecting thier municipal elections  candidates
tdp protecting thier municipal elections candidates

By

Published : Mar 3, 2021, 7:52 AM IST

Updated : Mar 3, 2021, 11:30 AM IST

పురపాలిక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరిరోజు కావడంతో అప్పటివరకూ అభ్యర్థుల్ని కాపాడుకునేందుకు తెదేపా అన్ని ప్రయత్నాలూ చేస్తుంది.ప్రత్యర్థులకుచిక్కకుండా రహస్య ప్రదేశాలకు తెదేపా అభ్యర్థులను తరలించి మరీ దాచిపెడుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీల్లో రాజకీయ ప్రత్యర్థులు తమ అభ్యర్థుల్ని తీవ్రంగా బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయకుండా భయాందోళనలకు గురి చేస్తున్నారని, అందుకు నిరసనగా ఆ రెండు చోట్లా ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు తెదేపా ప్రకటించింది.

ఆర్థిక మూలాలపై గురి

తమ అభ్యర్థుల్ని ఎన్నికల బరి నుంచి వైదొలిగేలా రాజకీయ ప్రత్యర్థులు సామ దాన భేద దండోపాయాల్ని ప్రయోగిస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ‘మొదట మా అభ్యర్థుల్ని పిలిచి.. మీకెందుకు ఎన్నికలు, మీరు గెలిచినా ప్రయోజనం ఉండదు, అనవసరంగా ఇబ్బందులు పడతారని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా మాట వినరనుకునే వారికి డబ్బు ఎరచూపి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అభ్యర్థుల బంధువుల్ని బెదిరించి... పోటీ నుంచి విరమించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారని’ తెదేపా నాయకులు వాపోతున్నారు.

పాత కేసులతో భయపెట్టి..

కొన్ని చోట్ల తమ అభ్యర్థులపై పాత కేసుల్ని తిరగతోడుతున్నారని, కొత్తగా కేసులు పెడతామని భయపెట్టి పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేస్తున్నారని తెదేపా ఆరోపిస్తోంది. విశాఖపట్నంలో ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడు గతంలో 3 సార్లు కార్పొరేటర్‌గా పనిచేశారు. ఈసారీ నామినేషన్‌ వేశారు. ఆయనపై పాత కేసు ఒకటి ఉంది. ఆయనకో రెస్టారెంట్‌ ఉంది. అది నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో నడుస్తోంది. జీవీఎంసీకి చాలా బకాయిలున్నాయని... ఆయనకో నోటీసు ఇచ్చారని, పోటీ నుంచి వైదొలగకపోతే రెస్టారెంట్‌ మూయించేస్తామని, పాత కేసు తిరగతోడి జైలుకి పంపిస్తామని ప్రత్యర్థులు హెచ్చరించారని, అందుకే పోటీ నుంచి ఆయన వైదొలిగారని స్థానిక తెదేపా నేతలు వివరిస్తున్నారు.

  • విశాఖలోనే జీఎంసీ మేయర్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నాయకుడి ఆస్తుల్ని నిషిద్ధ భూముల జాబితాలో చేర్చేశారని, ఆయన పోటీ చేస్తున్నారన్న కక్షతోనే ప్రత్యర్థులు అలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
  • అనంతపురం జిల్లా రాయదుర్గంలో... తెదేపా నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థికి కిరాణా కొట్టు ఉంది. ఆయన దుకాణానికి వెళ్లే దారికి అడ్డుగా గోడ కట్టారని, వేధింపులు తట్టుకోలేక ఆ అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.
  • అదే పట్టణంలో మరో అభ్యర్థిని పాత కేసు ఒకటి చూపించి బెదిరించారని, భారీగా నగదు ముట్టచెప్పి నామినేషన్‌ ఉపసంహరింపజేశారని చెబుతున్నారు.
  • ధర్మవరం పట్టణంలో విపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి ఇల్లు కట్టుకుంటుంటే... అది నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికారులు వెళ్లి బెదిరించడంతో, ఆయన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.


శిబిరాల్లో దాచిపెట్టి...

  • శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో తెదేపా తరఫున బరిలో ఉన్న 21 మంది అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలించారు.
  • కృష్ణా జిల్లా నందిగామలో 20 మంది తెదేపా అభ్యర్థులను రహస్య ప్రదేశానికి తరలించారు. నూజివీడు, తిరువూరుల్లో ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
  • చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆరుగురు తెదేపా అభ్యర్థుల్ని రహస్య ప్రదేశానికి పంపించారు. మదనపల్లెలో పోటీ నుంచి వైదొలగాలని తెదేపా అభ్యర్థులపై ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం.
  • అనంతపురం జిల్లా రాయదుర్గం, కల్యాణదుర్గంలో 25 మందికిపైగా అభ్యర్థుల్ని తెదేపా కర్ణాటకకు పంపించింది. పుట్టపర్తిలో అభ్యర్థుల్ని స్థానిక నాయకుడు తన కాలేజీ హాస్టళ్లలో దాచిపెట్టారు.
  • కడప జిల్లా మైదుకూరులో తెదేపా అభ్యర్థుల్ని రహస్య ప్రాంతానికి తరలించారు. రాయచోటిలో తమ అభ్యర్థుల్ని భయపెట్టి నామినేషన్లు ఉపసంహరింపజేశారని తెదేపా చెబుతోంది.
  • కర్నూలు జిల్లా డోన్‌లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కేఈ సోదరులు గతేడాదే ప్రకటించారు. ఎట్టకేలకు పది వార్డుల్లో తెదేపా నామినేషన్లు వేయడంతో, వారిపై ఒత్తిళ్లు రాకుండా రహస్య ప్రదేశానికి తరలించారు.
  • ఆళ్లగడ్డలో తెదేపా తరపున నామినేషన్‌ వేసిన వారిలో ఇద్దరు వేరే పార్టీలో చేరారు. అప్రమత్తమైన తెదేపా నేతలు.. 20 మంది అభ్యర్థుల్ని రహస్య ప్రదేశానికి తరలించారు.
  • నెల్లూరు జిల్లాలో పలు చోట్ల రాజకీయ ప్రత్యర్థుల తరపున పోలీసులే తమ అభ్యర్థుల్ని పిలిపించి మాట్లాడుతున్నారని తెదేపా ఆరోపిస్తోంది.
  • గుంటూరు జిల్లాలోని వినుకొండలో ప్రత్యర్థుల ఒత్తిళ్లకు భయపడి తెదేపా 18 మంది అభ్యర్థుల్ని రహస్య ప్రదేశాలకు తరలించారు. సత్తెనపల్లెలోనూ ఇదే పరిస్థితి. డెల్టా ప్రాంతంలోని రెండు పట్టణాల్లో ప్రత్యర్థులు తెదేపా అభ్యర్థులకు డబ్బులు ఎరజూపి పోటీ నుంచి వైదొలగాలని ఒత్తిడి తెస్తున్నారు.
  • తూర్పుగోదావరి జిల్లా తునిలో 14 వార్డులకుగాను 11 చోట్ల తెదేపా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

ఇదీ చదవండి:

వైకాపాకు ఓటేస్తే సుంకాల మోత: చంద్రబాబు

Last Updated : Mar 3, 2021, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details