పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డిల అరెస్టు.... ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన ఆయన.... రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులపై వేధింపులు, కక్ష తీర్చుకునేందుకే జగన్.... ముఖ్యమంత్రి అయినట్లుగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నేతల అవినీతిని వెలికితీస్తున్నందునే కక్షపూరితంగా వ్యవహరిస్తూ... అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని దుయ్యబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేత అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.... ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారని ఆక్షేపించారు. అచ్చెన్నాయుడుకి గురువారమే శస్త్రచికిత్స జరిగిందన్న చంద్రబాబు... అరెస్ట్ చేసి తీసుకువస్తున్న సమయంలో బ్లీడింగ్ అయిందని తెలిపారు. నాలుగైదు రోజులు ఆయనకు నొప్పి తీవ్రంగా ఉంటుందని వెల్లడించారు. పోలీసులు కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదన్న చంద్రబాబు... వారిలో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే జేసీ కుటుంబంపై జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిందని వెల్లడించారు. మూడేళ్ల క్రితం సాక్షి కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌రెడ్డి ఆందోళన చేపట్టినందుకు ఇప్పుడు కుట్రపూరితంగా వారిని అరెస్ట్ చేశారన్నారు. విచారణ ఎదుర్కొనేందుకు, పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నోసార్లు ప్రకటించారన్నారు.
అసలు వారిని వదిలేసి
కేసుకు సంబంధించిన అసలు సూత్రధారులను వదిలివేసి.... హైదరాబాద్‌కు వెళ్లి మరీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం వైకాపా రాజకీయ వేధింపులకు నిదర్శనమన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి మోసపూరితంగా వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్ కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న చంద్రబాబు... మధ్యవర్తిత్వం వహించిన ముత్తును విచారణ కూడా చేయలేదన్నారు. ఈఎస్ఐ వ్యవహారంలో ముందు 150 కోట్ల అవినీతి అన్న ఏసీబీ జేడీ.... సాక్షిలో రూ.900 కోట్ల స్కాం అని వచ్చే సరికి మాటమార్చి రూ.988 కోట్ల అవినీతి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి విజిలెన్స్ నివేదిక ప్రకారం ఈఎస్ఐ వ్యవహారంలో పక్కదారి పట్టింది రూ.7.96 కోట్లు మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. అందులోనూ అచ్చెన్నాయుడి ప్రమేయం, ప్రస్తావన ఎక్కడా లేదని.... విజిలెన్స్ రిపోర్టులో అచ్చెన్నాయుడి పేరు కూడా లేదన్నారు. ఎప్ఐఆర్లోనూ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరు లేకపోయినా... ఇరువురిని అత్యంత దుర్మార్గంగా అరెస్ట్ చేశారన్నారు. గతంలో తన విశాఖ పర్యటన సమయంలోనూ అప్పటికప్పుడు నోటీసు ఇచ్చినందుకు డీజీపీ గంటల తరబడి కోర్టులో నిలబడ్డారన్న చంద్రబాబు.... ఇప్పుడు అచ్చెన్నాయుడు, జేసీ కుటుంబ సభ్యుల అరెస్ట్ సమయంలోనూ సరైన డాక్యుమెంటేషన్ లేకుండా వెళ్లారన్నారు. దీనికి కూడా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.
నిబంధనలు వారికి వర్తించవా