ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం కొనసాగుతోంది: చంద్రబాబు - చంద్రబాబు పోలీసు టెర్రరిజం వ్యాఖ్యలు

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందర్భంగా పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఖాకీలు ఇలాగే పనిచేస్తే తిరుగుబాటు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అభ్యర్థుల ఇళ్లల్లో మద్యం ఉన్నట్లు చిత్రీకరించి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పోలీసు టెర్రరిజం కొనసాగుతోందన్న చంద్రబాబు.. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే వారు పనిచేయాలని హితవు పలికారు.

రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం కొనసాగుతోంది: చంద్రబాబు
రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం కొనసాగుతోంది: చంద్రబాబు

By

Published : Mar 14, 2020, 5:06 PM IST

Updated : Mar 14, 2020, 5:47 PM IST

రాష్ట్రంలో ఖాకీ, పోలీసు టెర్రరిజం కొనసాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులే టెర్రరిజం సృష్టిస్తే ఆ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లను అన్ని విధాలుగా అడ్డుకుని.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. నామినేషన్ల ప్రక్రియ అంతా ప్రహసనంలా మారిందన్న ఆయన.. అభ్యర్థులను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. తెదేపా అభ్యర్థులను నామినేషన్లు విత్​డ్రా చేసుకోవాలని అన్ని రకాలుగా బెదిరించారని విమర్శించారు. వైకాపా ప్రలోభాలు, బెదిరింపులకు చాలామంది లొంగిపోయారన్న చంద్రబాబు.. ప్రజలను కొట్టే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

పోలీసుల తీరుపై చంద్రబాబు విమర్శలు

డీజీపీ కోర్టుకెళ్లిన చరిత్ర గతంలో ఉందా..?

శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పనిచేయాలని సూచించిన చంద్రబాబు.. ఇలాగే ప్రవర్తిస్తే పోలీసు వ్యవస్థపై తిరుగుబాటు వస్తుందని విమర్శించారు. డీజీపీ కోర్టుకు వెళ్లి సెక్షన్‌ చదివిన చరిత్ర గతంలో ఉందా.. అని ప్రశ్నించిన ఆయన.. వైకాపా నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడులపై డీజీపీ సమాధానం చెప్పాలన్న చంద్రబాబు

సీసీలు లేకుంటే మా పరిస్థితేంటి..?

గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేత ఇంట్లో అర్ధరాత్రి మద్యం సీసాలు పెట్టిన ఘటనలో సీసీ కెమెరాలు లేకుంటే మా పరిస్థితేంటని చంద్రబాబు నిలదీశారు. మాచర్లలో తమ పార్టీ నేతలపై నడిరోడ్డుపై దాడికి దిగారని.. నిందితులపై పోలీసులు సాధారణ కేసులు పెట్టి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైండోవర్​ కేసుల పేరుతో పోలీసులే బెదిరిస్తున్నారని.. దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. వైకాపా నేతలు రాజగుంట ఎంపీటీసీ అభ్యర్థిని ఇంటికి రాత్రిపూట వెళ్లి బెదిరించారని ధ్వజమెత్తారు. పుట్టపర్తి ఎమ్మెల్యే కొందరి ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు.

ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్న చంద్రబాబు

మహిళలకు భద్రత ఉందా..?

మద్యం ఉందని తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు భద్రతా ఉందా అని ప్రశ్నించిన ఆయన.. ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని నిలదీశారు. స్థానిక ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్వీర్యమైందని చంద్రబాబు ఆరోపించారు. వీళ్లు చేసే అరాచకాలు ఎన్నికల సంఘానికి కనిపించవా అని ప్రశ్నించారు. వైకాపా నేతలను అలాగే వదిలేస్తే ఉగ్రవాదుల కంటే ఘోరంగా తయారవుతారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు ధైర్యంగా ఉండి స్వేచ్ఛగా ఓటేయాలని కోరిన చంద్రబాబు.. తాము చేస్తున్నది రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీని నిలిపివేస్తూ ఎస్​ఈసీ నిర్ణయం

Last Updated : Mar 14, 2020, 5:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details