ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని మార్పుపై ఉన్న శ్రద్ధ.. కరోనా వ్యాప్తి నివారణపై లేదు: చంద్రబాబు - chandrababu criticise ap cm jagan on devlopment projects in ap

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు సంధించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెబుతున్నామన్న ఆయన.. గత 14 నెలల్లో వైకాపా నేతలు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏది మంచి.. ఏది చెడు అనేది ప్రజలు గ్రహించాలన్న ఆయన.. తమ హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు.

మేమేం చేశామో చెబుతున్నాం.. 14 నెలల్లో మీరేం చేశారు..?: చంద్రబాబు
మేమేం చేశామో చెబుతున్నాం.. 14 నెలల్లో మీరేం చేశారు..?: చంద్రబాబు

By

Published : Aug 10, 2020, 5:42 PM IST

Updated : Aug 10, 2020, 7:03 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యమన్న చంద్రబాబు

రాష్ట్రంలో అన్ని జిల్లా అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకెళ్లామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి తామేం చేశామో చెబుతున్నామన్న ఆయన.. గత 14 నెలల్లో ప్రభుత్వం ఏ జిల్లాకు ఏం చేసిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. సమగ్రాభివృద్ధికి తెదేపా నాంది పలికిందని చెప్పారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది ప్రజలు గ్రహించాలని సూచించారు.

నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానానికి తీసుకొచ్చాం. జలవనరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. ఈపాటికి పూర్తికావాల్సిన పోలవరం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో అంతా గమనించాలి. అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశాం. వరుసగా నాలుగేళ్లు రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దాం. వ్యవసాయాన్ని ఆధునీకరించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాం. రహదారులు, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో సమస్యలు అనతికాలంలోనే అధిగమించాం.

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. 17 నెలల్లో జలవనరులకు ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదన్న ఆయన.. నిధులు ఖర్చు చేయకుంటే పెండింగ్​ ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని నిలదీశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తాము చాలా ప్రయత్నాలు చేశామన్న ఆయన... రాయలసీమ జిల్లాలను తయారీ రంగానికి, పారిశ్రామిక హబ్​గా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. తమ హయాంలో విశాఖను ఆర్థిక రాజధానిగా తయారు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. స్మార్ట్​ సిటీగా విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు రచించామని స్పష్టం చేశారు. తెదేపా అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లకుండా ఎదురుదాడి చేస్తారా..? అని చంద్రబాబు నిలదీశారు.

ప్రజారోగ్యంపై శ్రద్ధ ఏదీ..?

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్​ తర్వాత అత్యధికంగా వైరస్​ వ్యాప్తి చెందింది ఆంధ్రప్రదేశ్​లోనేనని జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం కోసం టెస్టులు చేస్తున్నారు తప్ప... నివారణ కోసం కాదని మండిపడ్డారు. కరోనా నివారణపై శ్రద్ధ పెట్టకుండా.. అమరావతి మార్పునకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసం కావాలో.. అభివృద్ధి కావాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన తరుణమిదని చంద్రబాబు అన్నారు. తెదేపా 13 జిల్లాలకు చేసిన అభివృద్ధిపై ఆయన వీడియో విడుదల చేశారు.

మాస్కులే ఇవ్వలేదు.. రాజధానులు కడతారా..?

మూడు మాస్కులు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేని వాళ్లు.. 3 రాజధానులు కడతారా అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. న్యాయస్థానాలన్నా లెక్కలేనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 17 నెలల్లో ఒక్క నిర్మాణానికైనా మట్టి వేశారా అని ఆక్షేపించారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం ప్రారంభించారన్న చంద్రబాబు... తెదేపా హయాంలో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చామని గుర్తుచేశారు.

ఇదీ చూడండి..

ఆ విషయాల్లో సీఎం జగన్.. నంబర్ 1: అయ్యన్నపాత్రుడు

Last Updated : Aug 10, 2020, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details