రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఎక్కి గాల్లో చక్కర్లు కొడితే ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలోని తమ కుటుంబ ఆరాధ్య దైవం కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో ఎంపీ రాహ్మహన్ నాయుడు, ఇతర కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల్లోకి రావడం లేదని, ప్రజలు బాధల్లో ఉన్నారని తన కర్తవ్యంగా భావించి నారా లోకేశ్ వరద ప్రాంతాలకు వెళ్తే విపరీతంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వరదలు వస్తే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 10 నిమిషాల్లో ప్రజల వద్దకు వెళ్లేవారిని, మంత్రులను, అధికారులను అప్రమత్తం చేసి తక్షణ చర్యలకు ఆదేశించేవారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు తానా అంటే తందానా అంటున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదక పరిస్థితి అని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని, మంత్రులు నోరు విప్పితే విమర్శలే తప్ప అభివృద్ధి, సంక్షేమం కోసం మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో చాలా ఆరాచకాలు జరుగుతున్నాయని..మానవత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏడాదిపాటు సమయం ఇచ్చామని, ఇంతలో కరోనా రావడం, తనపై అక్రమ కేసు పెట్టడంతో ప్రజల్లోకి రాలేకపోయానన్నారు. ప్రస్తుతం ప్రజలు బాధలు, ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రజల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని, కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పారు. మేం అధికారంలో ఉన్నప్పుడు మీలా ప్రవర్తిస్తే ఒక్క వైకాపా కార్యకర్త అయినా ఉండేవాడా అని ప్రశ్నించారు.