వైకాపా ప్రభుత్వ చేతకానితనం వల్లే ఏపీఎస్ ఆర్టీసీ లక్ష కిలోమీటర్లు, 250 బస్సులు నడిపే హక్కులు కోల్పోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 2.65 లక్షల కిలోమీటర్లు మేర తెలంగాణలో బస్సులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పుడు కేవలం 1.04లక్షల కిలోమీటర్లకే పరిమితం కావటం అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు.
ఈ నిర్ణయం వల్ల సంస్థకు తీవ్ర నష్టంతో పాటు కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న జగన్ బినామీ ఆస్తులు కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను ధారాదత్తం చేస్తూ సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అనాలోచిత ఒప్పందం ప్రజలకు అసౌకర్యం కలిగించటంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ప్రజలకు సేవలు విస్తృతం చేయాల్సింది పోయి సర్వీసులు తగ్గించుకోవాల్సిన అవసరం ఏమిటని అచ్చెన్న నిలదీశారు.