రాష్ర్టంలో 9 నెలలుగా ప్రజావ్యతిరేక పరిపాలన సాగుతోందని ఆరోపిస్తున్న తెదేపా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ప్రజాచైతన్య యాత్ర పేరిట 45 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ... ప్రకాశం జిల్లా మార్టూరులో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తొమ్మిది నెలల కాలంలో.... వైకాపా ప్రభుత్వం గత సర్కారు అమలు చేస్తూ వచ్చిన 9 పథకాలను రద్దు చేయటం సహా ప్రజలపై 9 రకాల భారం మోపటం, నవమోసాలకు పాల్పడిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక పథకం, ఆదరణ, చంద్రన్న బీమా, నిరుద్యోగభృతి, పండుగ కానుకలు, బీసీ, కాపు రుణాలను రద్దు చేసిన విషయాలను యాత్రల్లో భాగంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు ఇసుక, సిమెంట్, పెట్రోల్ రేట్ల వడ్డన, మద్యం, ఫైబర్ నెట్, విద్యార్థుల ఫీజులు పెంపు వంటి అంశాలను ప్రజాక్షేత్రంలో నిలదీయాలని నిర్ణయించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసి.... రైతు భరోసా పేరిట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందనేది తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఫించన్లు, రేషన్, అమ్మఒడి వంటి పథకాలతో పాటు ఇతరత్రా వాటిల్లో లబ్ధిదారులను భారీగా కుదించే మోసగిస్తోందని యాత్ర ద్వారా ప్రజలకు వివరించనున్నారు