వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాల మాఫియాను చూశామని, ఇప్పుడు సీఎం జగన్ బాక్సైట్ అక్రమ తవ్వకాల ద్వారా రూ.15వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరతీశారని తెదేపా ఎంపీలు ధ్వజమెత్తారు. బాక్సైట్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పార్లమెంటులో డిమాండ్ చేస్తామని తెలిపారు. జగన్ అంతర్గతంగా పోస్కో వంటి ప్రైవేటు సంస్థలతో బేరాలు కుదుర్చుకుంటూ.. బయటకు మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని చెబుతున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పదవులన్నింటికీ రాజీనామాలు చేద్దామని వైకాపా నాయకులు చెబితే.. తెదేపా రాజీనామాలకు సిద్ధమని తెలిపారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. సమావేశం వివరాలను ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ వివరించారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ పాల్గొన్నారు.
అధికారుల కోసం మాట్లాడుకుంటున్నారు కదా?
తెలంగాణ నుంచి కావలసిన అధికారుల్ని డిప్యుటేషన్‌పై తెచ్చుకోవడానికి.. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో రాత్రికి రాత్రే మాట్లాడి పనులు చక్కబెట్టుకుంటున్నప్పుడు జలవివాదంపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా ఎంపీలు ధ్వజమెత్తారు. ‘తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయి, రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి, ప్రధానికి లేఖలతో సరిపెడుతున్నారు. దీనిపై కేంద్ర జోక్యం చేసుకోవాలి’ అని తెలిపారు.
రఘురామపై అనర్హతే ఏకైక ఎజెండా
‘వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేసేలా ప్రయత్నించడమే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వైకాపా పెట్టుకున్న ఏకైక ఎజెండా. అది తప్ప, రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశంపైనా పోరాడేందుకు సిద్ధంగా లేరు’ అని మండిపడ్డారు.