ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత.. అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారిపోయిందని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోటలో వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు.
NARA LOKESH: 'ఫ్యాన్ గుర్తుకు ఓటేసి.. అదే ఫ్యాన్‌కు ఉరివేసుకుంటున్నారు..!' - ఏపీ టాప్ న్యూస్
ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత.. ఉద్యోగం రాక అదే ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ పాలనలో లోపాల కారణంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.
ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి.. సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు... సీఎం జగన్ మోసానికి బలైపోవడం బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు. వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. ఇంకెవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు.. ప్రభుత్వం వెంటనే ప్రస్తుతమున్న జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో మరో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. పోరాడి ఉద్యోగాలు సాధిద్దామని ట్విట్టర్ వేదికగా యువతకు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:BOARDS MEETING: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ