స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా చేస్తున్న దౌర్జన్యాలపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలిపారు. పోలీసులు, రిటర్నింగ్ ఆఫీసర్లు తెదేపా నేతల ఫోన్లు ఎత్తడంలేదని ఆరోపించారు. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన మహిళలపై వైకాపా కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని బర్తరఫ్ చేయాలని దీపక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా దాడులపై తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా ఆగడాలకు అంతే లేదన్న దీపక్‌రెడ్డి.. పోలీసుల సమక్షంలోనే తెదేపా అభ్యర్థుల నామినేషన్లు చింపేశారని మండిపడ్డారు.
పోలీసుల సహకారంతోనే వైకాపా శ్రేణులు రెచ్చిపోతున్నారని తెదేపా ఎమ్మెల్సీ ఏఎస్. రామకృష్ణ ఆరోపించారు. మాచర్ల ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని ఏకగ్రీవం అని వైకాపా ప్రకటించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.