రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను ప్రైవేటీకరించటం వల్ల 2 లక్షల కుటుంబాల ఉపాధికి గండి పడిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు ధ్వజమెత్తారు. 2వేల మంది ఏపీఎండీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. అందరికీ తెదేపా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసినందుకు ఇప్పటికే 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 మంది ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 1,200 రూపాయలు ఉండే ట్రాక్టర్ ఇసుక... ఇవాళ 7 వేల రూపాయలు అయ్యిందని ఆక్షేపించారు. జగన్ బినామీ సంస్థకు టెండర్ కట్టబెట్టిన 24 గంటల్లోనే టన్ను ఇసుక ధర వంద రూపాయలు పెంచి హ్యాండ్లింగ్, రవాణా ఛార్జీలు అదనంగా మోపారని దుయ్యబట్టారు.