"జగనన్న విద్యా కానుక అని స్కూల్ పిల్లల బెల్ట్, సాక్స్లకు వైకాపా రంగులు వేసుకునే ఎంపీ విజయసాయి రెడ్డి దుబారా ఖర్చు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. "దిల్లీ టూర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు, సలహాదారులకు దుబారా ఖర్చు, వైకాపా దందాలతో 10 పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చు" అని మండిపడ్డారు. "రూ.43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి, 16 నెలలు జైలులో ఉన్న జగన్ విజన్ ఉన్న నాయకుడా?" అని దుయ్యబట్టారు.
పోలవరం యాత్రకు ప్రజ ధనం వృధా చేసి ఉంటే వైకాపా బ్యాచ్ ఊరుకుంటుందా అని బుద్ధా ప్రశ్నించారు. 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కలను 70 శాతం చంద్రబాబు పూర్తి చేశారు కాబట్టే వాస్తవాలను ప్రజలకు చూపించారని అన్నారు. వైకాపా లాగా దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో తెదేపా ప్రభుత్వం పోరాడిందని తెలిపారు. కరోనా రాగానే చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లిపోయిన విజయసాయి.. నిస్సిగ్గుగా అబద్దపు ట్వీట్లు చేస్తున్నారని బుద్ధా వెంకన్న ట్విట్టర్లో మండిపడ్డారు.