ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజూ తెదేపా సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా... తెదేపా ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్షం స్పీకర్ దృష్టికి తీసుకెళ్లింది.
పీటీఐ కథనం ప్రకారం... పోలవరంపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కావాల్సినంత సమయం ఇచ్చినా ఉద్దేశపూర్వంగానే తెదేపా సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేపడుతున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 9 మంది ప్రతిపక్ష సభ్యులను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు.
తెదేపా సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోల బాలవీరాంజనేయ స్వామి, వేగుళ్ల జోగేశ్వరరావు, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లను సభనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి తమ్మినేని ప్రకటించారు.