వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. బడ్జెట్ (2020-21)కు సంబంధించి ఫిబ్రవరిలో ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం... ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు. చర్చించడానికి కేవలం రెండు రోజులే సమయం విధించటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం పూర్తిగా అభూత కల్పనగా ఉందని అభివర్ణించారు. గడిచిన సంవత్సర కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రాష్ట్రంలో జే ట్యాక్స్ వసూళ్లు పెరిగాయని దుయ్యబట్టారు.
'జగన్ పాదయాత్రలో 1650కు పైగా హామీలిచ్చారు. కానీ ఇవాళ నవరత్నాల పేరుతో అన్ని చేస్తున్నామని అనటం చెబుతున్నారు. ఈ సంవత్సరంలో కొత్తగా ఒక్క సంక్షేమ పథకం తీసుకురాలేదు. ఉన్న పథకాల పేర్లను మాత్రమే మార్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు. ప్రతిపక్షాలను అణిచివేయటానికి 1500కు పైగా అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 60 సార్లకు పైగా కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదు' - గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా ఎమ్మెల్యే