అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో సీఎం జగన్ మాట్లాడుతుండగా...తెదేపా సభ్యులు పోడియం వద్దకు వచ్చి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో తెదేపా సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సీఎం సూచించారు. సభా వ్యవహారాల మంత్రి బుగ్గన సస్పెండ్ చేయాల్సిన సభ్యుల పేర్లు చదివి వినిపించారు. అనంతరం స్పీకర్ సభ నుంచి తెదేపా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
చంద్రబాబు నిరసన
సభ నుంచి తెదేపా సభ్యులను సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ...పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. మైకు ఇవ్వమంటే ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభ్యులంటే కనీస మర్యాద లేకుండా మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.