ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒకే రాజధాని... ఒకే డిమాండ్

అమరావతి రైతుల ఉద్యమం నేటితో 200 రోజులకు చేరింది. అలుపెరగని అన్నదాతల పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు మద్దతు తెలిపారు. ఉదయం నుంచే మహాదీక్షలో కూర్చున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. ఆంధ్రుల కలల రాజధానితో వైకాపా ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతుందని విమర్శించారు.

ఒకే రాజధాని... ఒకే డిమాండ్
ఒకే రాజధాని... ఒకే డిమాండ్

By

Published : Jul 4, 2020, 7:20 PM IST

రాష్ట్రం వ్యాప్తంగా తెదేపా శ్రేణులు అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు. తెదేపా నేతలు వారి వారి ఇళ్లలోనే మహా దీక్ష చేశారు.

ప్రాంతాల మధ్య చిచ్చు: సోమిరెడ్డి

చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి కోసం రైతులు పోరాడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ 3 రాజధానులు ప్రకటన చేశారని ఆయన విమర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరం, అనువైన ప్రాంతమని తెలిపారు. 2 వేల కోట్లు ఖర్చు చేస్తే బ్రహ్మాండమైన రాజధానిగా అమరావతిని నిర్మించవచ్చని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

విఫలమైన రాజధానులు మోడల్ ఆదర్శమా? : కేశినేని శ్వేతా

5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి నిర్మాణమని...విఫలమైన దక్షిణాఫ్రికా మోడల్ రాజధానుల వలన ఖర్చు తప్ప రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని కేశినేని శ్వేతా అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన నిరసనలు 200 రోజులు పూర్తైన సందర్భంగా వారికి సంఘీభావంగా విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు.

మేనిఫెస్టోలో పెట్టారు : జ్యోతుల నెహ్రూ

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో తెదేపా సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ అమరావతి రైతులకు మద్దతుగా దీక్షకు కూర్చుకున్నారు. అమరావతి కోసం అసువులు బాసిన రైతులకు నివాళి అర్పించిన నెహ్రూ.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అన్ని పక్షాలు స్వాగతించాయని గుర్తుచేశారు. వైకాపా అమరావతి రాజధాని అని మేనిఫెస్టోలో కూడా పెట్టిందని నెహ్రూ అన్నారు.

ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి : ఆలపాటి

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తెదేపా సీనియర్ నేతలు ఆలపాటి రాజా, జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా గుంటూరులోని తెదేపా కార్యాలయంలో దీక్షలు చేపట్టారు. అమరావతి కోసం అసువులు బాసిన వారికి నివాళులు అర్పించారు. మూడు రాజధానుల ఆలోచన మూర్ఖపు ఆలోచనగా ఆలపాటి అభివర్ణించారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయటం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.

విధ్వంస పాలన : దేవినేని ఉమా

విజయవాడ గొల్లపూడి నివాసంలో అమరావతి ఉద్యమానికి మద్దతుగా మాజీమంత్రి దేవినేని ఉమా నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమం, విధ్వంస పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నానని ఉమా అన్నారు.

సమదూరంలో ఉంటుంది : నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

అమరావతి రైతుల ఆందోళన 200వ రోజులకు చేరిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెదేపా నాయకులతో కలిసి రైతులకు సంఘీభావం తెలుపుతూ దీక్ష చేపట్టారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధాని కావాలని రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.

మీ నిర్ణయం తప్పు : గద్దె రామ్మోహన్

అమరావతి రాజధాని కోసం రెండు వందల రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దీక్ష చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ తెదేపా నాయకులు, మహిళా నాయకులు ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేశారు. మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారని గద్దె రామ్మోహన్ తెలిపారు.

అసంతృప్తి పెరుగుతోంది : చింతమనేని

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని దెందులూరు మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ప్రజా రాజధాని అమరావతికి మద్దతుగా పెదవేగిలో దెందులూరు, పెదవేగి మండలం నాయకులతో కలిసి మహా దీక్షను నిర్వహించారు. ప్రమాణస్వీకారం రోజున ముఖ్యమంత్రి జగన్ ఎంతో సుపరిపాలన అందిస్తామన్నారు. కానీ జగన్ పాలనతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

మొండిగా వ్యవహరిస్తున్నారు : బి.టెక్ రవి

ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే రూ.10 కోట్ల విలువ చేసే ప్రజావేదిక పడగొట్టడంతో పాలన మొదలుపెట్టారని ఎమ్మెల్సీ బి.టెక్ రవి ఆరోపించారు. రాజధాని రైతులు, ప్రజలు చేస్తున్న దీక్షలు 200 రోజులకు చే రుకోవడంతో కడప తెదేపా నాయకులు మద్దతు ప్రకటించారు. రాజధాని విషయంలో జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అభివృద్ధి అంటే ఇదా : కళా

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే కార్యాలయాలు మార్చడం కాదని, స్థానిక సంస్థలకు విధులు-నిధులు బదిలీ చేయడమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు హితవు పలికారు. ప్రైవేటు కన్సెల్టెంట్లను నియమించుకుని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటం అభివృద్ధి వికేంద్రీకరణా అని ప్రశ్నించారు. తన పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా చేసుకుని స్థానిక సంస్థల అధికారాలను కుదించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహా ఉద్యమం : కాలవ శ్రీనివాసులు

అమరావతి రైతుల పోరాటం 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పార్టీ స్థానిక నాయకులతో కలిసి మహాదీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో భౌతికదూరం పాటిస్తూ అమరావతి రైతులకు మద్దతుగా నినాదాలు చేస్తూ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో 200 రోజుల ఉద్యమించడం చారిత్రకమని తెలిపారు. ప్రవాసాంధ్రులతో సహా 40 నగరాల్లో అమరావతే మా రాజధాని అంటూ నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి :వైకాపా ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు: సబ్బం హరి

ABOUT THE AUTHOR

...view details