TDP On Amravati Maha sabha: తిరుపతిలో అమరావతి సభ చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అశోక్‌బాబు అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో విజయవంతమైన సభ అని పేర్కొన్నారు. అకుంఠితదీక్షతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభం నుంచి సభ వరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా అండగా నిలవడం విశేషమని కొనియాడారు. ఒక్క వైకాపా తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు, యువజన, కార్మిక, రైతు, ప్రజాసంఘాలన్నీ రాజధాని రైతులకు జైకొట్టాయన్నారు. అధికార వైకాపా ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఎన్ని కేసులు బనాయించినా, ఆటంకాలు సృష్టించినా భగవంతుడితో పాటు రాష్ట్ర ప్రజలందరూ అమరావతివైపే నిలిచారని సోమిరెడ్డి తెలిపారు.
కేంద్రంలో అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న భాజపా ప్రభుత్వమే రైతుల పోరాటానికి తలొగ్గి మూడు కీలక బిల్లులను వెనక్కి తీసుకుందన్నారు. ఇక్కడేమో రైతులు నెలల తరబడి దీక్షలు చేసినా, వందల కిలోమీటర్లు నడిచినా జగన్మోహన్ రెడ్డి మనస్సు కరగకపోవడం దురదృష్టకరమన్నారు. మంచి మనస్సు చేసుకోకపోగా రైతుల సభకు పోటీగా వికేంద్రీకరణ సభ పెట్టి కాలేజీల యాజమాన్యాలను బెదిరించి విద్యార్థులను తరలించి గబ్బు పట్టడం అవసరమా అని నిలదీశారు. ఇప్పటికే ఘోరంగా విఫలమయ్యారని, ఇకనైనా కళ్లు తెరిచి అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్‌రెడ్డి మద్దతు పలికిన అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని హితవుపలికారు.