TDP LEADERS: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా మాట్లాడే వీడియో... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గల్లీ నుంచి దిల్లీ దాకా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తుంటే.. తాను కాదని ఆయన బుకాయించడం సిగ్గుచేటని తెదేపా నాయకులు మండిపడ్డారు. సిగ్గుమాలిన పని చేసి దొరికిపోయింది కాక.. తెదేపా నాయకుల పైనా, మీడియాపైనా నిందలేయడమేంటని ధ్వజమెత్తారు. ఈ వీడియో ప్రచారంలోకి రావడం వెనుక తానున్నానంటూ ఆరోపించిన మాధవ్‌పై పరువునష్టం దావా వేస్తానని, పార్లమెంటు హక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హెచ్చరించారు. ‘ఒక ఎంపీ ప్రైవేట్ వీడియోకు, నాకు ఏం సంబంధం ఉంటుంది? ఎంపీ మాధవ్ లోక్‌సభలో రాష్ట్రం కోసం పోరాడాల్సింది పోయి, నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ దొరికిపోయి, మార్ఫింగ్ చేశారంటూ మాపై నిందలు వేయడమేంటి? ఆ వీడియోను ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తామని చెబుతున్న మాధవ్ నిజంగా తప్పు చేయకపోతే భయపడాల్సిన పనేంటి? జగన్ మొన్నటిదాకా నా తండ్రిని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఇప్పుడు నాపై తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను రోడ్డుపైకి లాగాలని చూస్తున్నారు’ అని విజయ్ మండిపడ్డారు.
మాధవ్ తక్షణం రాజీనామా చేయాలి: కాల్వ శ్రీనివాసులు
‘మాధవ్ ఏ రోజూ ప్రజాసమస్యలపై పోరాడింది లేదు. తోటి ఎంపీలపై దాడులు చేస్తూ, బూతులు తిడుతూ, పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తూ అసాంఘిక శక్తిగా మారారు. ఎంపీగా ఉంటూ పాడుపనులు చేసి రాష్ట్రం పరువు తీశారు. మాధవ్ కోరినట్టుగా కేంద్ర ఫోరెన్సిక్ విభాగంతో దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. మాధవ్ తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయాలి’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.