'దళితులపై దమనకాండ - దళితద్రోహి జగన్ ' పేరిట పుస్తకాన్ని తెదేపా ఎస్సీ విభాగం విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. శిరోముండనం ఘటన జరిగి 40 రోజులైతే... ముఖ్యమంత్రి ఇన్ని రోజుల తరువాత స్పందించారని నేతలు విమర్శించారు. జరిగిన దారుణం రాష్ట్రపతికి తెలియబట్టే, అభద్రతతో ముఖ్యమంత్రి మాట్లాడారని దుయ్యబట్టారు.
జగన్ ప్రభుత్వం దళితులపై సాగిస్తున్న దమనకాండను పూర్తి వివరాలతో, ఆధారాలతో పుస్తకంలో వివరించామని వెల్లడించారు. ఈ పుస్తకం చదివితే రాష్ట్రంలోని దళితుల పరిస్థితేమిటో ప్రతి ఒక్కరికీ తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు, అధికారులు ఈ పుస్తకం చదివి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని దళితులకు ముఖ్యమంత్రి జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.