ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేయటం వల్ల తదుపరి పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిని అదునుగా చేసుకుని రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ప్రభుత్వ తదుపరి కార్యాచరణను ప్రతిపక్ష తెలుగుదేశం అంచనా వేస్తోంది. రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునేందుకు చట్టంలో ఉన్న ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే వరకూ వదిలేది లేదని భీష్మించుకుంది.
14 రోజులు దాటినా సెలెక్ట్ కమిటీ ఇంకా ఏర్పడనందున బిల్లులు ఆమోదం పొందినట్లే అన్న మంత్రుల వాదనను శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. ఆ నిబంధన కేవలం మనీబిల్లుకే చెల్లుతుందని... జనరల్ బిల్లుకు వర్తించదని స్పష్టం చేశారు. మండలి సమావేశాలు నిర్వహించబోమంటున్న ప్రభుత్వ వాదనను తప్పుపడుతున్న తెదేపా.... మండలి నిర్ణయం లేకుండా బడ్జెట్‌కు సంబంధించిన ద్రవ్యవినిమయ బిల్లు ఎలా ఆమోదం పొందుతుందని ప్రశ్నిస్తోంది.