ఎంపీ రఘురామకృష్ణరాజు కాలికి గాయాలున్నాయంటూ సుప్రీంకోర్టుకు నివేదిక అందడం.. రాష్ట్రంలో నియంత పాలనకు అద్దం పడుతోందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సును విస్మరించిన సీఎం జగన్.. కక్ష సాధింపు, ప్రతిపక్షాల అణచివేతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే సంకెళ్లు, పోరాడితే హింసించడమనే అజెండాతో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి..
సొంత పార్టీ ఎంపీని కొట్టించినందుకు జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. తెదేపా శాసన సభాపక్షం నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో.. రఘురామకృష్ణరాజుకు సంబంధించి సుప్రీంకోర్టుకు అందిన వైద్య నివేదికపై నేతలు స్పందించారు. ఈ నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒక ఎంపీకే రక్షణ లేదని తేలితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు.