నిపుణుల కమిటీ ప్రతిపాదనలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విభేదించారు. మూడుచోట్ల 3 రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి దిక్సూచిగా నిలవాల్సిన అమరావతిని జగన్ చంపేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న బ్రాండ్‌ను చెడగొట్టారన్న ప్రతిపక్ష నేత... ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చే దురాగతానికి ఒడిగడుతున్నారని ఆరోపించారు. ఎవరమూ శాశ్వతం కాదని... రాష్ట్రం, భావితరాల భవిష్యత్ మాత్రమే శాశ్వతం అనే విషయం గుర్తించాలన్నారు. మరోసారి మోసపోకుండా ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తానే రాజు, తానే మంత్రిలా ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని... తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. గవర్నర్, మంత్రులను పాలనకు దూరంగా ఉంచాలనే ఆలోచనతోనే... 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. జీఎన్ రావు కమిటీ ప్రతిపాదనలు చూస్తే... వారికి మతిపోయిందని అనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు ఆలోచన కుట్రపూరితమని మరో నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి... కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు.