సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ విజయం: అచ్చెన్నాయుడు
పంచాయితీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ విజయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. "ఎవ్వరైనా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని మరోసారి రుజువైంది. పాలకుడైనా.. పౌరుడైనా రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాల్సిందే. అతీత శక్తిగా వ్యవహరిస్తే ఎదురు దెబ్బలు తప్పవని జగన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం కాకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా పనిచేయాలి. ప్రజలు, వ్యవస్థలు మాత్రమే శాశ్వతం తప్ప ప్రభుత్వాలు కాదని ఉద్యోగ సంఘ నాయకులు తెలుసుకోవాలి. జగన్ రెడ్డి కోసం పని చేయాలనుకుంటే రాజ్యాంగం చేతుల్లో చెప్పు దెబ్బలు తప్పవని గ్రహించాలి. కోర్టులతో చివాట్లు తింటున్న జగన్ రెడ్డి వెంట నడుస్తారో లేక ప్రజాస్వామ్య హితులుగా నిలుస్తారో నిర్ణయించుకోవాలి." అని హితవు పలికారు.
'లా' ఇలా ఉందంటే మా'లా'గే వెళ్తామనటం శోచనీయం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
"ప్రజాస్వామ్య చరిత్ర లో ఓ చారిత్రాత్మక తీర్పు సుప్రీం కోర్టు ఇచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా వితండవాదం మాని ఎన్నికలకు సహకరించాలి. సహాయనిరాకరణ చేసిన ఉద్యోగుల సంఘంపై చర్యలు తీసుకోవాలి." -ట్విట్టర్ లో తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి
బెంచ్ మారినా పంచ్ మారలేదు: వంగలపూడి అనిత
"బెంచ్ మారినా పంచ్ మారలేదు. డేట్ మారినా ఫేట్ మారలేదు. పెద్ద కోర్ట్ కి పోయినా తిట్లు తప్పలేదు. అన్నయ్య ఇంట్లో పగిలిన మరో టీవి. ఏ1 రెడ్డి ఓదార్పు యాత్రకు బయల్దేరిన ఏ2 రెడ్డి." -ట్విట్టర్ లో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత
ఏమాత్రం మానాభిమానాలున్నా రాజీనామా చేయాలి: గన్ని కృష్ణ
సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వైకాపా ప్రభుత్వానికి ఏమాత్రం మానాభిమానాలున్నా తక్షణం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెదేపా అధికార ప్రతినిధి గన్నికృష్ణ డిమాండ్ చేశారు. "ఎన్నికల నిర్వహణకు కేంద్ర సిబ్బంది సాయం కోరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సరైన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగసంఘాలు ఇకనైనా ఇంగితం తెచ్చుకోవాలి" అని ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు.