తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసనలు వ్యక్తమయ్యాయని ఆ పార్టీ ప్రకటించింది. 162 నియోజకవర్గాల్లో ఆందోళనా కార్యక్రమాలు జరగగా... 427మండల కేంద్రాలు, 800గ్రామాల్లో శ్రేణులు నిరసనలు తెలిపినట్లు ఓ ప్రకటనలో తెదేపా పేర్కొంది. నిరసన కార్యక్రమాలలో 15 వేల 134 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ బాధ్యులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నట్లు వెల్లడించింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పిలుపు మేరకు ఎక్కడికక్కడ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే కాగడాల ప్రదర్శనలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై నిలదీశారనే తప్పుడు కేసులు బనాయించి... అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని నేతలు ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు ఎత్తేయాలని, బీసీలకు క్షమాపణ చెప్పాలని... తెదేపా కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేశారు. ‘‘వియ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు’’ హ్యాష్ ట్యాగ్... సోషల్ మీడియాలో భారీగా ట్రెండింగ్ అయిందని తెదేపా గుర్తుచేసింది. నేటి నుంచి ప్రతిరోజూ చంద్రబాబు పిలుపు మేరకు వర్చువల్ ఆందోళనలకు దిగనున్నట్లు పార్టీ నేతలు, నాయకులు ప్రకటించారు.
విశాఖలో...
అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు నిరసనగా విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో తెదేపా నాయకులు ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో...అంబేడ్కర్ కూడలి వద్ద కాగడాలు చేతపట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులు ఆపాలంటూ ఆందోళనలు చేశారు.
అచ్చెన్నాయుడుని విడిచి పెట్టకపోతే ప్రజలతో మమేకమై... ఆందోళన ఉద్ధృతం చేస్తాం
: గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే