వైకాపా ఇసుక దోపిడీకి అడ్డుపడుతుందనే రాష్ట్రంలో ఉచిత ఇసుకను అమలు చేయట్లేదని తెదేపా నేతలు ఆరోపించారు. నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ.. నాసిరకం ఇసుకను రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే నూతన విధానాన్ని జాప్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై తెదేపా నిరసన చేపట్టింది. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసు, ఇసుక మూటలతో ర్యాలీ నిర్వహించారు.
ఇసుక తట్టను తలపై పెట్టుకుని చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. గతంలో ఉచితంగా ఉన్న ఇసుక.. నేడు భారంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక సమస్య వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారిందని నేతలు ధ్వజమెత్తారు. కొత్త విధానం ప్రకటించకుండానే తెదేపా అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం.. కృత్రిమ కొరత సృష్టించిందని మండిపడ్డారు.