వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక మానసిక రోగి అని ఆమె దుయ్యబట్టారు. మతిస్థిమితం లేక ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు తెలియడం లేదన్నారు. నిజాయితీకి నిలువుటద్దమైన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడే అర్హత వెల్లంపల్లికి లేదని విమర్శించారు. గజపతిరాజు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. శ్రీనివాస్ సంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు వెంటనే వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలే పల్లెల్లో తరిమి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భక్తులు ఆలయాలకు విరాళంగా ఇచ్చిన భూములను దోచుకునేందుకే.. ప్రజలకు కొంత భూమి పంపిణీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వైకాపా పాలనలో ఆలయాలకు, దళితులకు, మహిళలకు భద్రత కరవైందని విమర్శించారు.
శాంతియుతంగా తలపెట్టిన ఛలో పులివెందులను అడ్డుకొని.. 21 మంది తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం హాస్యాస్పదమని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు దుయ్యబట్టారు. భారతదేశంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇక్కడే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఓ ఎస్టీ డీజీపీకి.. ఎవరిపై ఆ చట్టాన్ని ప్రయోగించాలో తెలియదా అని ప్రశ్నించారు. ఇండియన్ పీనల్ కోడ్ని పక్కనపెట్టి.. సీఎం జగన్ చట్టాలను గౌతమ్ సవాంగ్ అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఛలో పులివెందులను అడ్డుకున్నందుకు నిరసనగా.. ఈనెల 30న లక్షలాది దళితులతో భారీ ఎత్తున అక్కడకు వెళతామని స్పష్టం చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, ఎందరిపై అట్రాసిటీ కేసులు పెడతారో చూస్తామని సవాల్ విసిరారు. అత్యాచారానికి, హత్యకు గురైన మహిళ కుటుంబానికి న్యాయం చేయమని అడగటమే నేరమా అని ప్రశ్నించారు. దళిత నేతలను ఎక్కడ అడ్డగించారో.. అక్కడి నుంచే సీఎం జగన్ ప్రభుత్వ పతనం మొదలవుతుందని విమర్శించారు.