వైద్యుడి సస్పెషన్ ఎత్తివేయాలని తెదేపా నేతల డిమాండ్ ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాడుతున్న వైద్యులను సస్పెండ్ చేయటం హేమమైన చర్యని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేయొద్దని హితవు పలికారు. కరోనా కట్టడిలో క్షేత్ర స్థాయిలో సేవలు అందించే వారికి రక్షణ పరికరాలు కల్పించాలని కోరారు. ఆయుధాలు లేకుండా కరోనాపై యుద్ధమంటే ఆషామాషీ కాదని జగన్ తెలుసుకోవాలని సూచించారు. దాతలు ఇస్తున్న విరాళాలు ఏమవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి సమకూర్చాల్సిన సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పిన ఉద్యోగులను సస్పెండ్ చేసే కార్యక్రమం దుర్మార్గమని మండిపడ్డారు.
శ్వేతపత్రం విడుదల చేయండి : చెంగల్రాయుడు
వైకాపా ప్రభుత్వానికి పాలన చేతకాక వైద్యులు, అధికారులపై విరుచుకుపడుతుందని తెదేపా అధికార ప్రతినిధి చెంగల్రాయుడు మండిపడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించాలని కోరిన అధికారులను సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. వైద్యులు, అధికారులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కనీస వసతులు లేక వైద్యం చేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా అని ప్రశ్నించారు. ఏ జిల్లాకు ఎన్ని మాస్కులు, గ్లౌజులు ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆర్డినెన్స్ ద్వారా అన్నీ చక్కబెట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. ఎస్ఈసీని తొలగించే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మొండిగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి :ఎస్ఈసీ తొలగింపుపై తెదేపా నేతలు ఏమన్నారంటే..!