సీఎం జగన్‌కు 175 నియోజకవర్గాల నుంచి తెదేపా నేతల లేఖలు రాశారు. వినాయక చవితి వేడుకలకు ఆటంకం కలిగించవద్దని కోరారు. ఉత్సవాలకు అనుమతివ్వకపోతే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలతో ఈనెల 10న ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఆంక్షలపై దుమారం..!
రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలపై దుమారం రేగుతోంది. మిగతా పండగలకు అడ్డురాని కరోనా నిబంధనలు.. హిందువుల పండగైనా వినాయక చవితికే ఎందుకు వర్తిస్తుందో చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆదివారం కర్నూలులో భాజపా చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతక దారి తీసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. రాష్రవ్యాప్త ఆందోళనలకు కూడా పిలుపునిచ్చారు. చవితి వేడుకలపై ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది.
తెదేపా తీర్మానం..
ఇదే అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు కూడా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు వినాయక చవితికి ఏవిధంగా వర్తిస్తాయని..? నిలదీశారు. తెలంగాణలో వినాయక పూజలకు అనుమతించగా ఏపీలో మాత్రం ఎందుకు నిరాకరించారన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ నెల 10వ తేదీన చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
అనుమతులు ఇవ్వాలి: ఎంపీ రఘురామ
సినిమా థియేటర్లు, మద్యం దుకాణాల వద్ద లేని కరోనా.. గణేశ్ మండపాల వద్దే వస్తోందా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వేలమందితో మంత్రులు సభలు నిర్వహిస్తే రాని వైరస్.. వినాయక చవితి జరుపుకుంటేనే వస్తుందా అని నిలదీస్తున్నారని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. నిబంధనల పేరిట హిందూ పండుగలకు అనుమతివ్వకపోవడం సరికాదన్న రఘురామ.. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకొని కొవిడ్ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
అయితే మరోవైపు ప్రతిపక్షాల తీరుపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మంత్రి వెల్లంపల్లితో పాటు మల్లాది విష్ణు.. ఈ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. రాష్ట్రంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా పూజలు చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని.. ఎవరి ఇళ్లలో వారు పూజలు చేసుకోవచ్చని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. కరోనా కట్టడిలో భాగంగానే ప్రభుత్వం.. వినాయక చవితి ఉత్సవాల బహిరంగ నిర్వహణపై ఆంక్షలు విధించిందని స్పష్టం చేశారు. చవితి ఉత్సవాలపై.. భాజపా మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం, మతం రంగు పూయడం సరైన పద్ధతి కాదన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఆంక్షలు అమలు చేస్తున్నామని.. భాజపా నేతలకు దమ్ముంటే వెంటనే డిల్లీకి వెళ్లి నిబంధనల్లో మార్పులు చేయించాలన్నారు.
ఇదీ చదవండి
Vinayaka Chavithi controversy: చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు.. తగ్గేదేలేదంటున్న విపక్షాలు!