TDP HOUSE ARREST: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో మద్యం తాగి మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీని.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చనిపోయిన ఇద్దరు కల్తీ మద్యం తాగే మృతి చెందారని ఆరోపిస్తున్న తెలుగుదేశం.. గ్రామంలో పర్యటించి వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ప్రయత్నించింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు.. అనుమతి ఇవ్వలేదు. ఈ చర్యతో ప్రభుత్వం తమకు తామే దోషులమని ఒప్పుకుందని నిజనిర్ధారణ కమిటీ విమర్శించింది.
బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. అవి ప్రభుత్వ హత్యలేనంటూ ఆరోపిస్తున్న తెలుగుదేశం.. వాస్తవాలు తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.
అనగాని సత్యప్రసాద్, బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, పట్టాభి నేతృత్వంలోని బృందం..బాధిత కుటుంబాలను పరామర్శించి నిజాలు తెలుసుకునేందుకు పోటుమెరకకు వెళ్లాలని నిర్ణయించింది. తెలుగుదేశం నేతల పర్యటనకు అనుమతి లేదని.. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు.. కమిటీ సభ్యులను గృహనిర్బంధం చేశారు. మరికొందరి ఇళ్ల వద్ద ఆంక్షలు విధించారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. రేపల్లెలోని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించగా.. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి పోటుమెరకకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు, తెదేపా శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆగ్రహించిన ఎమ్మెల్యే రోడ్డుపైనే ఆందోళనకు దిగారు.