ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాయలసీమ వాసులకు రాజధానికి దారేది: తెదేపా నేతలు

తెదేపా ఎమ్మెల్యేలే రాజీనామా చేయాలంటూ మంత్రులు చేస్తున్న డిమాండ్​పై తెలుగుదేశం నాయకులు ఎదురుదాడికి దిగారు. ప్రజాతీర్పును ఎదుర్కోవటానికి వైకాపా భయపడుతోందంటూ ధ్వజమెత్తారు. తాము రాజీనామాలకు సిద్ధమని స్పష్టం చేసిన తెదేపా ఎమ్మెల్యేలు.. గత ఎన్నికల్లో ప్రజలను నమ్మించి మోసగించారు కాబట్టే, వైకాపా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

tdp leaders fires on ysrcp mla's over resigns
tdp leaders fires on ysrcp mla's over resigns

By

Published : Aug 4, 2020, 8:34 PM IST

అమరావతిపై మాట మార్చినందున అసెంబ్లీని రద్దు చేయాలంటూ చంద్రబాబు విధించిన 48గంటల డెడ్​లైన్​పై మంత్రుల విమర్శలకు తెలుగుదేశం నేతలు ఎదురుదాడికి దిగారు. రాయలసీమ వాసులకు రాజధానికి దారి ఏదంటూ నిలదీశారు. మడమ తిప్పడం.. మాట మార్చడం.. పేరిట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వీడియో విడుదల చేశారు. ఎన్నికల ముందు జై అమరావతి అని నినదించారని మండిపడ్డారు. అందుకే తమ అన్న రాజధానిలో సొంతిల్లు నిర్మించుకున్నారంటూ అన్ని ప్రాంతాల వైకాపా నాయకులూ బల్ల గుద్ది మరీ చెప్పారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ఇప్పుడు జే టర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.

రాజధాని మార్చమని చెప్పి ఇప్పుడు మోసం చేసినందుకు ప్రజాభిప్రాయం కోరకుండా తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని వైకాపా అనటం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రాజధానిగా అమరాతి కొనసాగుతుందంటూ ఎన్నికలకు ముందు వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యల వీడియోలను కాల్వ విడుదల చేశారు. జగన్ కు ప్రజల మీద నమ్మకం ఉంటే చంద్రబాబు సవాల్ ను స్వీకరించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్‌ చేశారు. తమ అధినేత సవాల్ ను స్వీకరించటానికి వైకాపా నాయకులు, జగన్ ఎందుకు ముందుకు రావడం లేదని యనమల రామకృష్ణుడు నిలదీశారు.

గత ఎన్నికల్లో ప్రజలను నమ్మించి మోసగించారు కాబట్టే, వైకాపా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు డిమాండ్‌చేశారు. అమరావతే రాజధాని అని గతంలో చెప్పి, ఇప్పుడు దాన్ని చంపేస్తున్నారని.. కొత్తగా ప్రజల తీర్పు కోరాలని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే అంశంపై రాజీనామాలకు తమ ఎమ్మెల్యేలు సిద్ధమని మరి వైకాపా సిద్ధమా అంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. మాట తప్పిన జగన్ దీనికి సిద్ధమో కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి 3 ప్రాంతాల్లోని సహజవనరులను దోచుకునేందుకు కుట్ర పన్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వైకాపా ప్రజాప్రతినిధులు అమరావతికి మద్దతుగా నిలబడి పదవులకు రాజీనామా చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కబ్జాలు, దోపిడీలు చేసే అరాచక శక్తులు రాజధాని మారుస్తారని ఎన్నికల ముందు చెప్పిన బొత్స ఇప్పుడు రాజధానిని ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

చంద్రబాబు సవాల్ పై ఎందుకు ముఖం చాటేస్తున్నారో చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి డిమాండ్ చేశారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తానని మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ప్రజలు జగన్ పక్షాన ఉన్నారని భావిస్తే, ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలని హితవుపలికారు. పేషెంట్ డాక్టర్​కు డెడ్ లైన్ ఇస్తే ఎలా ఉంటుందో బాబు డెడ్ లైన్ అలా ఉందన్న విజయసాయిరెడ్డి విమర్శలకు తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. తన వైద్యుడికి అలాగే డెడ్ లైన్ పెట్టి నెగెటివ్ రిపోర్ట్ ఇప్పించుకున్నారా? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టేటస్‌ కో

ABOUT THE AUTHOR

...view details