రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అధికార పార్టీ ఆరోపణలపై తెలుగుదేశం ఎదురుదాడికి దిగింది. ఉన్మాదుల భజన చేయకపోతే ఉసురు తీస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులను ఆపేసి, అరాచకాలను ప్రోత్సహించడమే పనిగా వైకాపా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లకు కలిగే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని చెప్పారు.
ప్రజల దృష్టిని మళ్లించడానికే...
ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని పాలకులు తెరపైకి తెచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. తెదేపాపై బురదజల్లే కార్యక్రమాలు తప్ప, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదన్నారు. సీఆర్డీఏ హద్దులకు ఆవల ఉన్న ప్రాంతాల్లోని భూములను కూడా రాజధాని భూములని విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించే ధైర్యం జగన్కు ఉందా అని ప్రశ్నించారు.
జగన్ పేరు పెట్టడం మరిచిపోయినట్టున్నారు...
ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం ఏసీబీ మర్చిపోయినట్టుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. అమరావతిలో జగన్ ఇళ్లు కట్టింది కూడా అమరావతి ప్రకటన తరువాతే కదా అని ప్రశ్నించారు. ప్రకటన వచ్చిన తరువాత కొన్నవి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే జగన్ రెడ్డి కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడినట్టేనని ఆయన స్పష్టం చేశారు.