కరోనా వ్యాప్తితో రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ ముఖ్యమంత్రి జగన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తప్పిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు స్థానిక ఎన్నికలను వాయిదా వేయడమే ఆయన చేసిన నేరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజా క్షేమం పట్ల జగన్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందనే దానికి ఈ ఘటనే నిదర్శనమని దుయ్యబట్టారు. ఆర్డినెన్స్‌ను అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ గవర్నర్‌కు లేఖ రాశారు. రాజ్యాంగ నిబంధన 243(కె) ప్రకారం ఐదేళ్ల కాల పరిమితికి ఎస్‌ఈసీ నియామకం జరిగిందని గుర్తు చేశారు.
ఫ్యాక్షన్ రాజకీయాలు : లోకేశ్
తనకు అడ్డొచ్చిన వాళ్లు ఎవరూ ఉండకూడదనే జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వం ప్రమాదకరమని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌కు రాజకీయాలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని దుయ్యబట్టారు. కరోనా సహాయక చర్యలను గాలికి వదిలి జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారంటూ తెదేపా శాసనసభాపక్షం మండిపడింది. న్యాయస్థానంలో భంగపాటు తప్పదని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు.
రాజ్యాంగ వ్యతిరేకం : టీడీఎల్పీ
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కక్షసాధింపు రాజ్యాంగ వ్యతిరేకమని తెదేపా శాసనసభాపక్షం మండిపడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి.. ఈ రాజ్యాంగ వ్యతిరేక ఆర్డినెన్స్ రద్దుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా సహాయక చర్యలను గాలికి వదిలి జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని టీడీఎల్పీ మండిపడింది.