ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP LEADERS: అప్పుడు మద్యనిషేధం.. ఇప్పుడు మద్య నియంత్రణా?- తెదేపా - తెదేపా నేతల ఆగ్రహం

TDP LEADERS: మద్య నిషేధం అని మాటిచ్చిన వైకాపా... ఇప్పుడు మద్య నియంత్రణ అంటోందని.. తెదేపా ధ్వజమెత్తింది. మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని... తాము బయటపెట్టిన నివేదికపై న్యాయ విచారణ జరిపించాలని.. డిమాండ్ చేసింది. మద్యం ద్వారా జగన్ రెడ్డి... నెలకు 5 వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని... తెదేపా నాయకులు ధ్వజమెత్తారు.

TDP LEADERS
అప్పుడు మద్యనిషేధం.. ఇప్పుడు మద్య నియంత్రణా

By

Published : Jul 13, 2022, 2:17 PM IST

Updated : Jul 14, 2022, 6:49 AM IST

అప్పుడు మద్యనిషేధం.. ఇప్పుడు మద్య నియంత్రణా

TDP LEADERS: ‘‘మద్యం వ్యాపారం చేసేదేమో ప్రభుత్వం. దాన్ని తయారు చేయించేది జగన్‌మోహన్‌రెడ్డి. అమ్మేది ఆయన చెప్పుచేతల్లోని కొందరు అధికారులు, వైకాపా కార్యకర్తలు. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే డిస్టిలరీలన్నింటిలో పాత యాజమాన్యాలను తరిమేశారు. తన మనుషులతో వాటిల్లో పాగా వేశారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతీ నాలుగు మద్యం బ్రాండ్లలో మూడు.. ముఖ్యమంత్రి, ఆయన బినామీ కంపెనీలకు చెందినవే. ఇంకెవరి బ్రాండ్లైనా అమ్మాలంటే వారు ముడుపులు, కమీషన్లు చెల్లించాల్సిందే. ఈ దందాలో జగన్‌ ఇప్పటివరకూ.15 వేల కోట్లు దోచుకున్నారు. ఆ డబ్బునే రానున్న ఎన్నికల్లో ఖర్చు చేస్తామంటూ వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు...’’ అని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు డోల బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావులు మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు.

అదాన్‌ డిస్టిలరీస్‌లో ఐటీ సలహాదారు రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడికి భాగస్వామ్యం
అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు ముప్పిడి అనిరుధ్‌రెడ్డికి భాగస్వామ్యం ఉంది. ఆ సంస్థ ఏర్పాటు చేసినప్పుడు ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడు. 2019 ఎన్నికల వరకూ జగన్‌ వద్ద క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వంలో సలహాదారుగా చేరారు. అదాన్‌ డిస్టిలరీస్‌లో డైరెక్టర్‌గా కొనసాగుతున్న కాశీచయనుల శ్రీనివాస్‌.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డికి సన్నిహితుడు. 2019 డిసెంబరు 2న ఏర్పాటైన ఈ కంపెనీకి రెండేళ్లలోనే రూ.1,164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యం సరఫరా కోసం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, రోహిత్‌రెడ్డిలకు చెందిన కంపెనీ కాబట్టే దానిపై అంత ప్రేమ చూపించారు. అదాన్‌, ఎస్‌పీవై డిస్టిలరీస్‌లు జగన్‌, వైకాపా నేతల బినామీలవే. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నెలకు 25 లక్షల కేసుల మద్యం అమ్మితే వాటిల్లో 90 శాతం జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన బినామీ డిస్టిలరీస్‌ల్లో తయారవుతున్న విషపు మద్యమే. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ అమ్ముతున్నారు. అందుకే డిజిటల్‌ చెల్లింపులకు అనుమతించడం లేదు. దోపిడీ కోసమే డిజిటల్‌ చెల్లింపుల్ని ఆపేశారు.

పోస్టుమార్టం నివేదికలను ఎందుకు బయటపెట్టడం లేదు?
* జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి చనిపోయిన ఘటనలో పోస్టుమార్టం నివేదికల్ని ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు. విషపు మద్యం గుట్టు బయటపడుతుందని కాదా?

* 9 సీ హార్సెస్‌, సిల్వర్‌ స్ట్రైప్స్‌, ఆంధ్రా గోల్డ్‌ విస్కీల్లో విషపు రసాయనాలు ఉన్నాయని మేము చెప్పిన తర్వాత... వాటిని మద్యం దుకాణాల్లో లభించకుండా చేసేసిన మాట వాస్తవం కాదా?

* తొలుత మద్య నిషేధం అని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు దాన్ని మద్య నియంత్రణగా మార్చేశారు....’ అని తెదేపా నాయకులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 14, 2022, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details