ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2021, 8:28 PM IST

ETV Bharat / city

TDP Fire On GOVT: అవగాహనాలోపంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు: తెదేపా నేతలు

వైకాపా పాలనపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహనాలోపంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తెదేపా హయాంలో వ్యాపారవేత్తలుగా ఎదిగిన మహిళలను నేడు కూలీలుగా మార్చారని ధ్వజమెత్తారు.

వైకాపా పాలనపై తెదేపా ఆగ్రహం
వైకాపా పాలనపై తెదేపా ఆగ్రహం

అన్ని రంగాలను నిర్వీర్యం చేసి, ప్రజలను మభ్య పెడుతూ పరిపాలన చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఇళ్ల నిర్మాణాలు, నిత్యావసర ధరలు , పెట్రో మంటలు, కరెంటు కోతలతో రాష్ట్రం అల్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా... నేటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ విమర్శించారు. అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆఖరి ఘడియలు సమీపించినట్లే...

రాయలసీమ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హిందూపురం పార్లమెంటరీ అధ్యక్షుడు పార్థసారథి హెచ్చరించారు. రాయలసీమ ప్రాజెక్టులపై మంత్రి శంకర్ నారాయణ అవగాహన లేకుండా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఎస్సీలపై దాడులు ఆపకపోతే ప్రభుత్వానికి ఆఖరి ఘడియలు సమీపించినట్లేనని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఎస్సీల ప్రాణాలు రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మహిళలను కూలీలుగా మార్చారు...

పొదుపు సంఘాల సొమ్మును ఆసరా పేరుతో జగన్ ప్రభుత్వం తన సొంత ఖర్చులకు వాడుకుంటోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. చంద్రబాబు హాయాంలో వ్యాపారవేత్తలుగా ఎదిగిన మహిళలను నేడు జగన్ ప్రభుత్వం కూలీలుగా మార్చి పొలాలబాట పట్టించిందని మండిపడ్డారు. ప్రజాసేవను విస్మరించి అవినీతే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారన్నారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details