ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులపై పోలీసుల లాఠీఛార్జ్​ను ఖండించిన తెదేపా నేతలు - lokesh fire on police Lottie charge

ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద అమరావతి రైతుల మహాపాదయాత్రపై పోలీసులు వ్యవహరించిన తీరును తెదేపా నేతలు ఖండించారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దారుణమని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. మహాపాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి సీఎం జగన్ రెడ్డికి చలిజ్వరం పట్టుకుందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

తెదేపా నేతలు నారా లోకేశ్, అచ్చెన్నాయడు
తెదేపా నేతలు నారా లోకేశ్, అచ్చెన్నాయడు

By

Published : Nov 11, 2021, 1:33 PM IST

Updated : Nov 11, 2021, 10:30 PM IST

ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు దారుణమని లోకేశ్‌ మండిపడ్డారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు అనుమ‌తితో చేస్తున్న పాద‌యాత్రకు ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నించారు.

న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తున్నారు..
మహాపాదయాత్రలో వస్తున్న ప్రజాస్పందన చూసి సీఎం జగన్ రెడ్డికి చలిజ్వరం పట్టుకుందని అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల మహాపాదయాత్రకు ఎన్నికల కోడ్ ఆపాదించి అడ్డుకోవాలని చూడటం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించటమే అని మండిపడ్డారు. బారికేడ్లు అడ్డంపెట్టి పాదయాత్రకు ప్రజలు మద్దతు లేకుండా చేయాలనుకుంటున్న పోలీసు చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లి ఆదేశాలతో అమలయ్యే రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రజలు ఉపేక్షించబోరని తేల్చిచెప్పారు. జగన్ రెడ్డి చేసిన పాదయాత్ర అధికారం కోసమైతే రైతులు రాష్ట్రం కోసం నిస్వార్థంగా పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. సంఘవిద్రోహ శక్తులను పోలీసుల ముసుగులో పంపి అడ్డుకోవాలని చూసే దుర్మార్గపు ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. రైతుల ఉద్యమం ఆగాలంటే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఎక్కడా రాజకీయ పార్టీల జెండాలు లేవు...

ప్రభుత్వ దయతో రైతుల మాహాపాదయాత్ర సాగట్లేదని, హైకోర్టు అనుమతితో సాగుతోందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర హితవు పలికారు. పాదయాత్రపై అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, పోలీసుల సాయంతో అడ్డుకోవటం ఎందుకని ప్రశ్నించారు. పాదయాత్రలో ఎక్కడా పార్టీల జెండాలు లేవని, రాజకీయ నాయకులు సైతం రైతు జెండాలు పట్టుకునే పాదయాత్రలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. భూమి ఇచ్చిన రైతుల ఆవేదన చూడలేక ఎంతోమంది సామాన్య ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.

రైతులపై లాఠీఛార్జ్..
ప్రకాశం జిల్లా చదలవాడలో రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. ఉద్రిక్తత కారణంగా రైతుల పాదయాత్రకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. యాత్రలో పాల్గొనేందుకు పెద్దఎత్తున వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ పోలీసులను తోసుకుంటూ ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు. భారీగా వచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో గ్రామాల నుంచి ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు రోడ్లు దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

అయితే.. ఎన్ని అడ్డుకులు సృష్టించినా.. తమ లక్ష్యాన్ని అడ్డుకోలేరంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు. మరోవైపు రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాల వారూ సంఘీభావం తెలుతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, నేతలు పాల్గొంటున్నారు.

న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర పేరుతో నవంబర్ 1వ తేదీన రైతుల మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజులపాటు సాగనున్న ఈ పాదయాత్ర.. డిసెంబర్ 15వ తేదీన చిత్తూరు జిల్లాలో ముగియనుంది.

అనుబంధ కథనాలు

Last Updated : Nov 11, 2021, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details