వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2021 జూలై వరకు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. జీవోలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ప్రజలకు తెలియకూడదని భావిస్తున్నారంటే పాలకులు అవినీతి చేస్తున్నారనే భావించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ జీవోలను ఆన్లైన్లో ఉంచకపోవడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జీవోల దాపరికంపై గవర్నర్కు ఫిర్యాదు చేసి, అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకెళతామని అశోక్ బాబు హెచ్చరించారు.
రాష్ట్రంలోని సహజవనరులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకు కట్టబెట్టి, సొమ్ము చేసుకుంటున్నారని తెదేపా సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఇసుక రీచ్లన్నింటినీ ఒకే వ్యక్తికి అప్పగించారని మండిపడ్డారు. కరోనా కారణంగా భవన నిర్మాణ సామగ్రి, గ్రానైట్ పరిశ్రమలు ఇప్పటికే తీవ్రనష్టాల్లో ఉన్నాయని, వారి నుంచి అధికార పార్టీ నేతలు అనధికారికంగా ఏటా రూ.350కోట్లు వసూలు చేస్తున్నారని ఆక్షేపించారు.