రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 77తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులు కార్మికులుగా, కూలీలుగా మారే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా దీవెనను నిలిపివేస్తూ జీవో 77 జారీ చేయడాన్ని తప్పుబట్టారు.
‘తెదేపా హయాంలో మూడు విడతలుగా బోధనా రుసుములు విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తే.. జగన్‌రెడ్డి దాన్ని నాలుగు విడతలుగా మార్చారు. 2021-22 విద్యా సంవత్సరానికి ఈ ప్రభుత్వం 70 శాతం ఫీజులే చెల్లించింది. పైగా కేంద్రం తన వాటా కింద ఇచ్చిన 60 శాతం నిధులను మళ్లించింది. ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 5.18 లక్షల మంది విద్యార్థులకు బోధనా రుసుములు చెల్లించకుండా వారి భవిష్యత్తును నాశనం చేసింది’ అని మండిపడ్డారు. జీవో 77ను రద్దు చేసి ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులందరికీ ఫీజులు చెల్లించాలని కోరారు.
ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోలేని దుస్థితి: ప్రణవ్ గోపాల్