రాష్ట్ర ప్రజలకు వైకాపా ప్రభుత్వం ప్రత్యేక కొవిడ్ ప్యాకేజీ ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. కొవిడ్ నియంత్రణకు జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం రూ.6 వేల నగదుతో పాటు 16 రకాల నిత్యవసర సరుకులు ఇస్తున్నందున ఏపీ ప్రభుత్వం కూడా కరోనా బాధితులను ఆదుకోవాలని సూచించింది. కరోనా నివారణ చర్యలను ప్రభుత్వం విస్మరించినందుకే రెండో దశ ఉద్ధృతిలో ఏపీ 2వ స్థానంలో ఉందని దుయ్యబట్టారు.
అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్లైన్లో ముఖ్యనేతల సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించారు. కరోనా నియంత్రణను గాలికొదిలేసి.., అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక చర్యలతో దోపిడీని ప్రశ్నించే వారిపై కక్ష సాధించేందుకు సీఎం నిమగ్నమయ్యారని ధ్వజమెత్తారు. న్యాయస్థానం తీర్పును ధిక్కరించి జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న రఘురామ కృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేయటంతో పాటు వైకాపా నేత భార్య నేతృత్వంలో వైద్య నివేదిక రూపొందించారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ అధికారి ఆసుపత్రికి వెళ్లి నివేదిక తారుమారు చేయించి.., రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా దొడ్డి దారిన రఘురామను జైలుకు తరలించారని విమర్శించారు.