మద్యం బదులు అన్నం పెట్టండి
మద్యం తయారు చేయించే బదులు అన్న క్యాంటీన్లు తెరచి పేదల ఆకలి తీర్చాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు హితవుపలికారు. పేదలు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. పేదలకు పట్టేడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనా నివారణ మందు తయారీలో ఉంటే జగన్ మాత్రం తన కమీషన్ల కోసం మద్యం తయారీ చేయించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగి నిత్యావసర దుకాణాలే మూసేసే పరిస్థితులుంటే మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు.
విపత్కర పరిస్థితుల్లో మద్యం తయారీ చేయాల్సిన అవసరం ఏముందని, మద్యం షాపులు ఏమైనా మెడికల్ షాపులా అని కళా ప్రశ్నించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కళ్లు గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్న కళా.. జగన్ మాత్రం వారి గురించి పట్టించుకోకుండా తన కమీషన్ల కోసం మద్యం తయారీపై దృష్టి పెట్టడం సరికాదన్నారు.
లాక్డౌన్లోనూ మద్యం ఏరులై పారుతోందని కళా వెంకట్రావు విమర్శించారు. వాలంటీర్లు నాటుసారా తయారీ చేయిస్తున్నారని ఆరోపించారు. జగనన్న అమ్మఒడి పథకంలా, జగనన్న నాటుసారాతో నోరుతడి పథకం ఏమైనా రాష్ట్రంలో అమలవుతుందా అని ఎద్దేవాచేశారు. ఏపీకి వెళ్ళొద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుందన్నారు. 5 రూపాయలతో మూడుపూటలా అన్నం పెట్టలేని జగన్ 3 రాజధానులు ఎలా కడతారో దేవుడికే తెలియాలని కళా ధ్వజమెత్తారు.