ఉద్యోగాల కల్పనపై తప్పుడు ప్రకటనలిచ్చిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలతో ఇస్తున్న ప్రకటనల్ని చూస్తుంటే రానున్న రోజుల్లో సూర్యుడు పడమరన ఉదయిస్తాడనే ప్రకటనలు కూడా ఇవ్వటంతో పాటు తితిదే బ్రహ్మోత్సవాలు, దసరా పండుగకు స్వచ్ఛంద సేవ చేసే వారినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. జూన్ 21న ఉద్యోగాల విప్లవం పేరుతో ఇచ్చిన ప్రకటనతో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందన్న అశోక్ బాబు.. విపక్షాలు ప్రశ్నిస్తున్నా సమాధానం ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్నందుకే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఎస్ స్థాయిలో స్పందన లేకుంటే చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. ప్రజలందరినీ ఒకేసారి మోసం చేసేలా ప్రకటన ఇచ్చారని మండిపడ్డారు.
ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి: దేవినేని
కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలంలోని కూనపరాజుపర్వ గ్రామంలో రైతులతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వినూత్నంగా నిరసన తెలిపారు. ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నిన అనంతరం ఆయన రైతులతో కలిసి వరి నాటు వేశారు. ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో కూలీలకు ఇచ్చేందుకు డబ్బులు లేక రైతే నాట్లు వేసుకునే దుస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వ అసమర్థత వలన దేశానికి వెన్నెముకలా నిలవాల్సిన రైతు అప్పుల బాధతో వ్యవసాయం చేయలేక కూలబడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాలని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించండి: వర్ల రామయ్య
సీఎం జగన్ రెడ్డి పాలన జనరంజకమంటున్న సజ్జల, ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సవాల్ విసిరారు. "అక్రమాలు, దౌర్జన్యాలతోనే స్థానిక ఎన్నికలు గెలిచారని ప్రజలందరికీ తెలుసు. అమరావతి ప్రాంతంలో రోడ్డు తవ్వి కంకర, గ్రావెల్ దొంగతనం చేసిన నేరస్థుల్ని రక్షించేందుకే సజ్జల తెదేపాపై నిందలు వేస్తున్నారు. ఇసుక మాఫియా కోసమే కరకట్ట రహదారి విస్తరణకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ నిర్మాణాలను పూర్తి చేసి ఉంటే కోకాపేటను మించిన ధరలు ఇక్కడ పలికేవి. తనపై ఉన్న కేసులకు భయపడే జగన్ రెడ్డి కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు. అవినీతి చక్రవర్తిని సజ్జల ఎంతో కాలం కాపాడలేరు." అని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు.