మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చర్యలను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం కక్ష సాధింపే చర్యల్లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీనేతలు ధ్వజమెత్తారు. అవినీతిని ప్రశ్నించినందుకే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ఆగ్రహం...
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలను వరుస అరెస్టులు చేస్తున్నారని.... ఇలాంటి దుర్మార్గాలను తమ పార్టీ నైతిక స్థైర్యంతో.. మనోనిబ్బరంతో ఎదుర్కొంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.ప్రతికారేచ్ఛతో సీఎం జగన్ రగిలిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తెదేపా చేస్తున్న పోరాటాల్ని జగన్ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఏడాది వైఫల్యాలపై జనాల దృష్టి మరల్చేందుకే... అరెస్టులు చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్ జైలుకు వెళ్లారన్న కక్షతోనే తెదేపా నాయకులను జైళ్లకు పంపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు రికార్డులతో కేసులు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.
అచ్చెన్నాయుడి అక్రమ అరెస్టును పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డిని, ఆయన తనయుడిని అరెస్టు చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు.
లొంగితే పార్టీలోకి...లేకుంటే జైల్లోకి అన్న రీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీమంత్రి
ఒక తప్పు కప్పిపుచ్చడానికి జగన్ 100 తప్పులు చేస్తున్నారు. తప్పులను సరిదిద్దుకునే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. తప్పులు, అసహనం, కక్షసాధింపే జగన్ పతనానికి బాటలు. - యనమల
వైకాపా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే సీఎం జగన్‌కు కనబడటంలేదా.... అని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బీసీ నాయకులను అణగదొక్కడమే ప్రభుత్వ ద్యేయమని దుయ్యబట్టారు.