రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వ్యవహారంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. గవర్నర్ నిర్ణయాన్ని తెదేపా స్వాగతించింది. భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని గవర్నర్ నిలబెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్యలతో ఆర్టికల్ 243కె(2)కు సార్థకత ఏర్పడిందన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింస విధ్వంసాలు, అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రానికి అప్రతిష్ట వాటిల్లిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య 4 మూల స్థంభాలైన లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, మీడియా మనుగడ ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు.
వైకాపా ప్రభుత్వానికి గట్టి దెబ్బ : యనమల
కరోనాలో ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీని తొలగించి రాజ్యాంగ ఉల్లంఘనకు వైకాపా ప్రభుత్వం పాల్పడిందని చంద్రబాబు అన్నారు. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడిందన్నారు. గవర్నర్ ఆదేశాలు జగన్ ప్రభుత్వానికి, అతని న్యాయ విభాగానికి గట్టి దెబ్బ అని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగన్ ఇకనైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని యనమల హితవు పలికారు.
రాజ్యాంగ విలువలు పరిరక్షించారు : సోమిరెడ్డి
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎస్ఈసీగా నియమించి హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించడం ప్రజాస్వామ్య విజయమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ పాత్రను ఎవరైనా శిరసావహించక తప్పదని తన ఉత్తర్వుల ద్వారా సందేశం ఇచ్చిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని, విలువలను కాపాడటంలో పొరపాట్లు చేయకుండా ప్రవర్తిస్తుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.