tdp leaders on padayatra: జగన్ రెడ్డి మూడు రాజధానుల ముచ్చట తెచ్చి అమరావతిలో కుంపటి పెట్టారని మాజీ మంత్రి జవహర్ దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందు భూములిచ్చిన రైతుల త్యాగాన్ని పొగిడి అధికారంలోకి వచ్చాక వారిని ఇబ్బందులపాలు చేశారని మండిపడ్డారు. ప్రాంతాలవారీ చిచ్చు పెట్టకూడదని చెబుతూనే చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. హైకోర్టు అమరావతి పనులు 6నెలల్లో ప్రారంభించమంటే నేటివరకు ప్రారంభించలేదని జవహర్ ఆక్షేపించారు. అమరావతి రైతుల కౌలు విషయంలో మోసం చేశారన్నారు. గతంలో అమరావతి రైతులను ప్రజలు పూలపాన్పుపై నడిపించడాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయిందన్నారు. సీపీఎస్ అనాలోచిత నిర్ణయమని ఒప్పుకొన్నట్లే.. అమరావతి రాజధాని విషయంలో కూడా అనాలోచిత నిర్ణయమని ఒప్పుకోవాలని జవహర్ తెలిపారు.
పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదు: వంగలపూడి అనిత
అమరావతి మహిళ రైతులు చేపడుతున్న పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదని తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. ప్రజాస్వామ్యంలో తమకు అన్యాయం జరిగితే నిరసన తెలిపే హక్కు ఉందని వివరించారు. పాదయాత్ర ద్వారా మహిళా రైతులు దైవదర్శనం చేసుకునేందుకే వెళ్తున్నారని అన్నారు. అమరావతి రాజధానిపై కులం రంగు పులమటం దారుణమన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు తెదేపా ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా బందోబస్తు కల్పించారని గుర్తు చేశారు. అమరావతి మహిళలు చేస్తున్న పాదయాత్రకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.