చెదరని చిరునవ్వు, నోరారా పలకరింపుతో తెలుగు వారందరికీ ఆత్మీయ నాయకుడిగా నందమూరి హరికృష్ణ మెలిగారని తెదేపా నాయకులు చంద్రబాబు, లోకేశ్‌లు కొనియాడారు. నేడు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని.. నివాళులర్పించారు. మనస్సులో ఏదీ దాచుకోకుండా నిర్మొహమాటంగా బయటకి చెప్పే అరుదైన వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి హరికృష్ణ మామ అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. నటనలోనైనా, రాజకీయాల్లోనైనా ఆయన పంథా విలక్షణమన్నారు. భౌతికంగా మనతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మన మదిలో చెరగని ముద్ర వేశాయని గుర్తు చేశారు. హరి మావయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
తెదేపా స్థాపించినప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు చైతన్యరథనానికి.. రథసారధిగా ఉండి, పార్టీ అధికారంలోకి రావటానకి నందమూరి హరికృష్ణ కృషి చేశారని మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర అన్నారు. నందమూరి హరికృష్ణ 3 వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సేవలు చేసిన హరికృష్ణ తమ అందరికీ ఆదర్శమన్నారు. పార్టీ శ్రేణులను ఎంతో ఆప్యాయంగా పలుకరించే వ్యక్తి హరికృష్ణ అని నేతలు కొనియాడారు.